నిజామాబాద్ రూరల్, ఆగస్టు 25 : పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలువాలని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే, బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు. ఒకటో డివిజన్ పరిధిలోని ఖానాపూర్ గ్రామంలో రూ.15 లక్షలతో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను అదనపు కలెక్టర్, మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ చిత్రామిశ్రాతో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా బస్తీ దవాఖానను ఏర్పా టు చేశారని తెలిపారు. జిల్లాకు మూడు బస్తీ దవాఖానలు మంజూరైనట్లు చెప్పారు. ప్రైమరీ హెల్త్ సెంటర్లో తరహాలో బస్తీ దవాఖానలో కూడా ఒక డాక్టర్, హెడ్ నర్సు, ఆరోగ్య సిబ్బంది ఉంటారని వివరించారు.
దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన మోదీ
ఎనిమిదేండ్ల కాలంలో దేశాన్ని రూ.80 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కిందని బాజిరెడ్డి విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరగని అభివృద్ధి, అమలు కానీ సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో పకడ్బందీగా అమలవుతున్నాయని చెప్పారు. దేశంలోనే ఆదర్శ సీఎంగా కేసీఆర్ పేరొందడం గర్వకారణమన్నారు. బడాబాబులకు కొమ్ముకాస్తూ ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేయడమే లక్ష్యంగా మోదీ ప్రభు త్వం ముందుకు సాగుతుందని మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలకు నష్టం కలిగించే చర్యలు చేపడుతున్నదని ఆరోపించారు. బీజేపీ నాయకుల మాయమాటలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ బానోత్ అనూష ప్రేమ్‌దాస్, వైస్ ఎంపీపీ అన్నం సాయిలు, కార్పొరేటర్ కొర్వ లలిత గంగాధర్, డీఎంహెచ్‌వో సుదర్శనం, టీఆర్ఎస్ నాయకులు ముస్కె సంతోష్, కొర్వ శ్రీనివాస్, దాసరి శ్రీధర్, మోహన్, కేసీఆర్ సేవాదళ్ రూరల్ సెగ్మెంట్ కన్వీనర్ కొర్వ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.