సంప్రదాయానికి ప్రతీకగా గిరిజనులు తీజ్ పండుగను జరుపుకొంటారు. ఆషాఢ, శ్రావణ మాసాల్లో భక్తి పారవశ్యంతో ఈ వేడుకలు నిర్వహిస్తుంటారు. తెలంగాణ ప్రాంతంలోని గిరిజన తండాల్లో యువతీ యువకులు ఆటాపాటలతో తొమ్మిదిరోజుల పాటు ఉత్సవాల్లో సందడి చేస్తారు.వందల ఏండ్ల నుంచి వస్తున్న ఆచార, సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడుకుంటున్న గిరిజనులు తీజ్‌ను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని గిరిజన తండాల్లో తీజ్ సందడి మొదలైంది.
-గాంధారి, జూలై 25
గాంధారి, జూలై 30 : తీజ్ అంటే మొలకలు అనే అర్థం వస్తుంది. ఈ పండుగను కేవలం పెండ్లికాని గిరిజన యువతులు మాత్రమే జరుపుకొంటారు. తరతరాలుగా వస్తున్న ఆచార, సంప్రదాయాల ప్రకారం గిరిజనతండాల్లో ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. ఆషాఢం, శ్రావణ మాసాల్లో వ్యవసాయ పనుల్లో తీరిక దొరకగానే, తండాల్లోని పెండ్లికాని యువతులందరూ తీజ్ పర్వదినాన్ని జరుపుకోవడానికి సిద్ధమవుతారు. పది రోజులు ముందుగానే తండాల్లోని యువతులందరూ కలిసి తండా పెద్ద(నాయకుడు) వద్దకు వెళ్లి, ఆయన సూచనల మేరకు పండుగ జరుపుకొనే రోజును నిర్ణయిస్తారు. దీంతో తండాల్లోని పెండ్లికాని యువతులు వారి సోదరుల సహకారంతో అడవికి వెళ్లి పుట్టమన్నును సేకరిస్తారు. ఆ మట్టిని ఇంటికి తీసుకువచ్చి వెదురు, దూసుర తీగలతో బుట్టలను అల్లి, అందులో పుట్టమన్నును పోసి గోధుమ గింజలను వేస్తారు. ఈ విధంగా తండాలోని ప్రతి యువతీ.. తాను తయారు చేసిన బుట్టలను తండా పెద్ద ఇంటి ఎదుట ఏర్పాటు చేసిన మంచెపై పెడుతారు. గోధుమ గింజలు ఉన్న వెదురు బుట్టలకు తొమ్మిది రోజులపాటు, యువతులు నీళ్లు పోసి గోధుమ మొలకలను పెంచుతారు. చివరి రోజున తండావాసుల సమక్షంలో సమీపంలోని వాగుల్లో, ఒర్రెల్లో నిమజ్జనం చేస్తారు.
నియమనిష్టలతో ఉపవాస దీక్ష..
తీజ్ ఉత్సవాల్లో పాల్గొనే గిరిజన యువతులు తొమ్మిది రోజుల పాటు నియమనిష్టలతో ఉపవాస దీక్షలో ఉంటారు. తీజ్ (గోధుమ మొలకలకు) రోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నీరు పోసి సంరక్షిస్తారు. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు పెండ్లికాని యువతులందరూ ఒక చోట చేరి పుట్టమన్నుతో రెండు బొమ్మలను (అమ్మాయి, అబ్బాయి) తయారు చేస్తారు. ఆ బొమ్మలను తండాలోని ఆలయం వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం అందరూ కలిసి అక్కడే వంటలు వండుకొని భోజనాలను చేస్తారు. చివరి రోజు మధ్యాహ్నం నుంచి తండాలోని గిరిజన యువతులందరూ సంప్రదాయ దుస్తులు, ఆభరణాలను ధరించి తండా నాయకుడి ఇంటి వద్దకు చేరుకుంటారు. ఈ సందర్భంగా యువతులు పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. పెండ్లికుదిరిన యువతులు తాము జరుపుకొనే చివరి తీజ్ పండుగ ఇదేనని భావోద్వేగానికి గురవుతారు. సాయంత్రం వేళ యువతులందరూ తమతమ గోధుమ బుట్టలను నెత్తిమీద పెట్టుకొని నిమజ్జనానికి తీసుకువెళ్తారు. ఈ సందర్భంగా బంధువులు తమ ఆడపిల్లలకు డబ్బు రూపంలో కట్నకానుకలను సమర్పిస్తారు. దీనికి ప్రతిఫలంగా యువతులు కొన్ని గోధుమ మొలకలను బంధువులకు అందజేస్తారు.
తీజ్ పండుగ జరుపుకొనే తొమ్మిది రోజులూ.. యువతులు గ్రామదేవతలను వారి ఆకాంక్షలను నెరవేర్చమని కోరుకుంటారు. తమకు సుగుణాలున్న భర్త రావాలని, వచ్చే సంవత్సరానికి తమకు వివాహమై వెళ్లిపోతున్నందున తమ ఊరి పెద్దలను, పాడి పంటలను కాపాడాలని కోరుకుంటారు.
ఎక్కడ ఉన్నా సొంతగూటికి..
తొమ్మిది రోజులపాటు జరుపుకొనే తీజ్ వేడుకల్లో పాల్గొనడం కోసం గిరిజనులు ఎక్కడ ఉన్నా తమ సొంత తండాలకు చేరుకుంటారు. గిరిజన సంప్రదాయం, ఆచారాలు, సంస్కృతులను కాపాడుకోవడం కోసం ఉన్నత కొలువుల్లో దూరప్రాంతాల్లో స్థిరపడినవారు సైతం యేటా కుటుంబసమేతంగా తండాలకు వస్తారు.
అంతా మంచి జరగాలని..
తండాలో పెండ్లికాని యువతులు తమ జీవితంలోకి మంచి భర్త రావాలని, భవిష్యత్తులో ఎలాం టి కష్టాలు రాకుండా, పిల్లాపాపలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ తీజ్ వేడుకలు జరుపుకొంటారు. తొమ్మిది రోజులపాటు ఉపవాసదీక్షలో ఉంటూ గిరిజనుల ఆరాధ్యదైవాలు సేవాలాల్ మహరాజ్, మేరమ్మకు పూజలు చేస్తారు.