నందిపేట్, అక్టోబర్ 8: కాపర్ వైర్, ఆయిల్ దొంగలు రెచ్చిపోతున్నారు. నిశీధిలో వ్యవసాయ క్షేత్రాల్లో విధ్వంసం సృషిస్తున్నారు. ఫలితంగా ఉమ్మడి జిల్లాలోని ట్రాన్స్ఫార్మర్లకు రక్షణ లేకుండా పోయింది. ఎత్తిపోతల పథకాల్లోని నియంత్రికలను సైతం కొల్లగొడుతుండడం కలకలం రేపుతున్నది. ఇటీవలి కాలంలో ట్రాన్స్ఫార్మర్ల ధ్వంసరచన బాగా పెరిగి పోయింది. ప్రధానంగా జాతీయ రహదారులతో పాటు రోడ్లకు పక్కనున్న నియంత్రికలే లక్ష్యంగా దుండగులు రెచ్చిపోతున్నారు. కేవలం కాపర్ వైర్ కాయిల్స్, ఆయిల్ కోసం దొంగతనాలకు తెగబడుతున్నారు.
వ్యవసాయ క్షేత్రాలే కాకుండా ఎత్తిపోతల పథకాల వద్ద ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లనూ వదలడం లేదు. ఇలా ఎత్తుకెళ్లిన కాయిల్స్‌ను బయట అమ్మితే వారికి దక్కేది రూ.వేలల్లో మాత్రమే. కానీ ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులకయ్యే ఖర్చు మాత్రం తడిసి మోపెడవుతున్నది. పైగా మరమ్మతులకు పదిరోజులుకు పైగా సమయం పడుతుండడంతో అప్పటి వరకూ పంటలకు నీటి విడుదల నిలిచి పోతున్నది. నందిపేట్ సహా వివిధ మండలాల్లో ఎక్కడో ఒకచోట చోటు చేసుకుంటున్న ట్రాన్స్ఫార్మర్ల ధ్వంసం కేసులు పోలీసులకు సవాల్ మారుతున్నాయి. మహారాష్ట్రకు చెందిన ముఠానే ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మూడు లిఫ్ట్‌ల వద్ద ట్రాన్స్ఫార్మర్ల చోరీ
మండలంలోని చౌడమ్మ కొండూర్, దత్తాపూర్, తల్వేద ఎత్తిపోతల పథకాల మొదటిస్టేజీ పంప్‌హౌస్ వద్ద ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లను గత జూన్‌లో దొంగలు ద్వంసం చేసి, అందులోని కాపర్ (రాగి) కాయిల్స్‌ను ఎత్తుకెళ్లారు. వారం రోజుల వ్యవధిలో మూడుచోట్ల దొంగతనాలు జరిగాయి. ట్రాన్స్ఫార్మర్లను గద్దెపై నుంచి కిందికి పారేయడంతో అవి పూర్తిగా దెబ్బతింటున్నాయి. కాయిల్స్ తోపాటు రిపేర్ చేయడానికి ఒక్కో ట్రాన్స్ఫార్మర్కు సుమారు రూ. 10 లక్షల ఖర్చు అవుతున్నదని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.
లిఫ్ట్‌లపై రూ.లక్షల్లో భారం పడుతుండడంతో తల్వేద, చౌడమ్మ కొండూర్ ఎత్తిపోతల ట్రాన్స్ఫార్మర్లను రిపేరు చేయించి నడుపుకుంటున్నారు. దత్తాపూర్ ట్రాన్స్ఫార్మర్ను మాత్రం ఇంకా రిపేరు చేయించకపోవడంతో లిఫ్టు నడవడం లేదు. అలాగే గడిచిన ఈ నాలుగు రోజుల్లో పంటపొలాల్లోని మూడు ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురయ్యాయి. కంఠం గ్రామ శివారులో రెండు, చౌడమ్మ కొండూర్‌లో దుండగులు ఒక ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసి, అందులోని కాపర్‌ను ఎత్తుకెళ్లారు.
పగలు రెక్కీ..రాత్రి చోరీ
నందిపేట్ మండలంలో ఇటీవల వరుసగా ట్రాన్స్ఫార్మర్లను కొల్లగొట్టారు. పది రోజుల వ్యవధిలోనే మూడింటిని ధ్వంసం చేసి కాపర్ వైరు, ఆయిల్ ఎత్తుకెళ్లారు. తాజాగా బోధన్ మండలంలోని రాజీవ్‌నగర్ తండా శివారులో గల 25 కేవీ ట్రాన్స్ఫార్మర్ను, గ్రామ శివారులోని గల 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ను సైతం ధ్వంసం చేసి రాగి తీగలను దొంగిలించారు. దుండగులు మధ్యాహ్న సమయంలో రెక్కీ నిర్వహించి, రాత్రివేళ దొంగతనాలకు పాల్పడుతున్నారు. మహారాష్ట్ర నుంచి వస్తున్న వారే నందిపేట్‌లో చోరీలు చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు.
ఉమ్మెడ వద్ద గోదావరి నదిపై వంతెన నిర్మాణం పూర్తికావడంతో మహారాష్ట్ర ప్రాంతానికి దూరభారం తగ్గిపోయింది. దీంతో నందిపేట్ ప్రాంతంలో కొత్త వ్యక్తుల సంచారం పెరిగింది. బైక్‌లు, మార్కెట్లో చిల్లర దొంగతనాలు పెరిగిపోయాయి. మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవారు ఇక్కడ దొంగతనాలకు పాల్పడుతూ.. వంతెన మీదుగా చాకచాక్యంగా తప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. వంతెన వద్ద పోలీసు తనిఖీలు కూడా లేకపోవడం దుండగులకు అడ్డూ అదుపులేకుండా పోయింది. ఇప్పటికైన వంతెన వద్ద తనిఖీలు చేస్తే చోరీలను అరికట్టవచ్చని, ఆ దిశగా పోలీసులు ప్రయత్నాలు చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాయిల్స్, రిపేర్లకు లక్షల్లో ఖర్చు
ఎత్తిపోతల పథకాల ట్రాన్స్ఫార్మర్ల నుంచి కాయిల్స్ ఎత్తుకెళ్లే దొంగలకు మిగిలేది రూ. 20 నుంచి 30 వేలు మాత్రమే. పంటపొలాల్లోని ట్రాన్స్ఫార్మర్ల కాయిల్స్‌కు రూ. 5 వేల లోపే. దొంగతనానికి గురైన ట్రాన్స్ఫార్మర్లకు మాత్రం ఎత్తిపోతల దానికి రూ. 10 లక్షలు, పంటపొలాల దానికి రూ. లక్షా 50 వేల భారం ప్రభుత్వంపై పడుతోంది. దొంగతనం జరగ్గానే ట్రాన్స్‌కో సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు ఎఫ్ఐఆర్ చేసిన తరువాతే రిపేరు కోసం అనుమతి లభిస్తున్నది. రిపేరు చేయడానికి వారం రోజుల సమయం పడుతుంది. ట్రాన్స్ఫార్మర్ మళ్లీ యథాస్థానానికి చేర్చడానికి మొత్తం వారం నుంచి పది రోజుల సమయం పడుతున్నది.
ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం..
ట్రాన్స్ఫార్మర్ల దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. పాత నేరస్తులను విచారించి, వారిపై నిఘా ఉంచాం. మాకు దొరికిన ఆధారాలకు అనుగుణంగా దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. మండలంలో దొంగతనాలు అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
-హరిబాబు, నందిపేట్ ఎస్సై