పోతంగల్ : బాల్యవివాహాలు చేయడం, ఆ వివాహాలను ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని నిజామాబాద్ జిల్లా మిషన్ కోఆర్డినేటర్ స్వప్న అన్నారు. మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో ఐసీడీఎస్, ఐసీపీఎస్ ఆధ్వర్యంలో ‘బాల్య వివాహ నిరోధక చట్టం 2006’ పై మండల, గ్రామస్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.
బాలికలకు 18 సంవత్సరాలు, బాలురకు 21 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహం చేయాలన్నారు. బాల్య వివాహాల వలన కలిగే అనర్థాల గురించి వివరించారు. బేటి బచావో బేటి పడావో, గర్భస్త శిశువులింగ నిర్ధారణ నిషేధ చట్టం, లైంగిక వేధింపులు, గృహహింసలపై అవగాహన కల్పించారు. మహిళా చట్టాలు, ఆపద సమయంలో ఎవరిని సంప్రదించాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీవో, ఐసీపీఎస్ సోషల్ వర్కర్ సాయిలు, అంగన్వాడీ సూపర్వైజర్ వెంకటరమణ, అంగన్వాడీ టీచర్లు బాల లక్ష్మి, జయ శ్రీ, ప్రమీల, పుష్ప, శయనాజ్, జ్యోతి అనసూయ, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.