కోటగిరి, ఫిబ్రవరి 26:గిట్టుబాట ధర రాక టమాట రైతు కుదేలవుతున్నాడు. మార్కెట్లో ధర దక్కక టమాటలు తెంపకుండా పొలంలోనే వదిలేస్తున్నా రు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం దేవునిగుట్ట తండా, నాగేంద్రపూర్ గ్రామాలకు చెందిన పలువురు రైతులు టమాట సాగు చేశారు. దిగుబడి బాగానే ఉన్నా మార్కెట్లో సరైన ధర పలుకడం లేదు. ప్రస్తుతం కిలో రూ.10 లోపే ఉండడంతో రైతులు దిక్కు తోచని స్థితిలో పడిపోయారు. పంట కోసి మార్కెట్కు తీసుకెళ్తే వ్యాపారులు పెట్టెకు రూ.100 ఇస్తామంటున్నారని వాపోతున్నారు.
టమాట తెంపడానికి వచ్చే కూలీల ఖర్చు కూడా రావడం లేదని దిగాలు చెందుతున్నారు. దేవునిగుట్ట తండాకు చెందిన ఫకీరా నాయక్ అర ఎకరంలో రూ.40 వేలు పెట్టుబడి పెట్టి టమాట సాగు చేశారు. పంట ఏపుగా కాసినా ధర లేకపోవడంతో ఆయన ఆందోళన చెందుతున్నాడు. రూ.40 వేలు పెట్టుబడి పెడితే రూ.900 ఆదాయం మాత్రమే వచ్చిందని ఫకీరా నాయక్ వాపోయారు. టమాట తెంపడానికి అయ్యే కూలి ఖర్చు కూడా రాకపోవడంతో తెంపకుండానే పొలంలో వదిలేసినట్లు తెలిపాడు. నాగేంద్రపూర్కు చెందిన రైతు చలపతి గిట్టుబాటు ధర రావడం లేదని టమాటను పొలం పక్కన పారబోశాడు.