సుభాష్‌నగర్/బాల్కొండ, జూన్ 7: తొలకరి జల్లులతో పలకరించే మృగశిర కార్తె శనివారం నుంచి ప్రారంభమవుతుందని పండితులు పేర్కొంటున్నారు. వాతావరణంలో కలిగే మార్పులకు అనుగుణంగా పండుగలు, పర్వదినాలు జరుపుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం.
తొలకరి వర్షాలు మృగశిర కార్తెతో ప్రారంభమవుతాయని, రైతులు పంట పొలాలను సిద్ధం చేసుకోవడం, ఆరోగ్య రక్షణ కోసం చేపమందును, ఇంగువ బెల్లం మింగడం ఆనవాయితీగా వస్తున్నది. ఉదయం 7.05 నుంచి సాయంత్రం 5.05 గంటల వరకు ఇంగువ బెల్లాన్ని సేవించాలని వేదపండితులు ప్రకాశ్ శర్మ వివరించారు.
పలు గ్రామాల్లో మృగశిర కార్తెను ప్రజలు శుక్రవారమే నిర్వహించుకున్నారు. దీంతో చేపలను కొనేందుకు తరలివచ్చిన వారితో మార్కెట్లు కిటకిటలాడాయి. మృగశిర కార్తె రోజు చేపలను తినడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే.