నేటి ఆధునిక యుగంలో మనిషి యంత్రంలా మారాడు. పోటీ ప్రపంచంలో తీరిక ఉండడం లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఆహారపు అలవాట్లలో మార్పుచోటుచేసుకోగా.. శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోయింది. టెక్నాలజీ ఎన్నో సౌకర్యాలు, సుఖాలను తెచ్చిపెట్టడంతోపాటు అంతకు మించిన స్థాయిలో చికాకు, కోపం, అసహనం వంటివి అందించింది. ఇందుకోసం రకరకాల మందులను వినియోగిస్తున్నా కొంత వరకు మాత్రమే ఉపశమనం పొందుతున్నాడు. శాశ్వాత పరిష్కారం లభించడం లేదు. వీటి నుంచి బయట పడేందుకు ఎంతో మంది యోగాపై ఆసక్తి పెంచుకుంటున్నారు. యోగా సాధనతో మానసిక, శారీరక సమస్యలను పూర్తిగా అధిగమించవచ్చుననే భావన ప్రతి ఒక్కరిలో వ్యక్తమవుతున్నది.
-కామారెడ్డి/ సుభాష్‌నగర్, జూన్ 20
శారీరక రుగ్మలతోపాటు మానసిక సమస్యలకు చక్కని పరిష్కారానికి యోగా మార్గం చూపుతున్నది. దీంతో యోగా సాధకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించడానికి యోగా సాధనంగా ఉపయోగపడుతున్నది. ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న పరమ ఔష ధం యోగా. ఇప్పుడు యోగా కేంద్రాలు వీధివీధిలో వెలిశాయి. శిక్షకుల సంఖ్య సైతం పెరిగింది. యోగా విశిష్టతను తెలియజేస్తూ ప్రతి సంవత్సరం జూన్ 21న దేశ వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో పలు యోగా కేంద్రాల్లో యోగా విశిష్టతపై అవగాహన కల్పిస్తున్నారు.
కామారెడ్డిలో 1994లో గరిపల్లి ఆంజనేయులు 15 మందితో యోగా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రంలో వందల మంది ఉచితంగా శిక్షణ పొందుతున్నారు. జిల్లా కేంద్రంలోని పతంజలి యోగా సమితి, భారత్ స్వాభిమాన్, ఆయుష్ యోగా కేంద్రాల ద్వారా కూడా శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. ప్రతి రోజు ఉదయం 5 నుంచి జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్ కాలనీలోని పతంజలి యోగా కేంద్రంలో, రాంమందిర్ లో యోగాలో శిక్షణ ఇస్తున్నారు. విశ్రాంత ఉపాధ్యాయుడు రాంచంద్రం సీనియర్ సిటిజన్లకు ఉచితంగా యోగా శిక్షణ ఇస్తున్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో మూడు యోగా కేంద్రాలు ఏర్పాటు చేశాం. ప్రతిరోజూ ఉదయం 5 నుంచి 6 గంటల వరకు యోగా నేర్పిస్తున్నాం. 24 ఏండ్ల నుంచి యోగా తరగతులు నిర్వహిస్తున్నాం.యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుంది.
-గడ్డం రాంరెడ్డి, యోగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు
20 ఏండ్ల నుంచి యోగా చార్యులుగా ఎంతో మందికి శిక్షణ ఇస్తున్న. అనారోగ్య కారణాలతో అనేక మంది యోగాపై ఆసక్తి చూపి నేర్చుకుంటున్నారు. మందులు అవసరం లేకుండానే యోగా సాధనతో దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతున్నాయి.
-రమ, యోగాచార్యురాలు
1983 నుంచి యోగా శిక్షణ ఇవ్వడం మొదలు పెట్టారు. 1986లో యోగా అసోసియేషన్ ఏర్పాటు చేశాను. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో దయానంద్ యోగా కేంద్రాన్ని నెలకొల్పి ఉదయం, సాయంత్రం అనేక మందికి యోగాలో శిక్షణ ఇస్తున్నాను. యోగాతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తమ నిత్య జీవితంలో యోగాను ఒక భాగంగా అలవర్చుకోవాలి.
-రాంచంద్రం, ప్రముఖ యోగాచార్యులు