సమైక్యపాలనలో ప్రజలే కాదు.. దేవుళ్లూ, దేవాలయాలూ నిర్లక్ష్యానికి గురయ్యాయి. చారిత్రాత్మక ఆలయాలు సైతం ఆనవాళ్లు కోల్పోయాయి. వేలాది ఎకరాల దేవుడి మాన్యం కబ్జాకు గురైంది. అయితే, గుడులకు పట్టిన గ్రహణం తెలంగాణ సిద్ధించిన తర్వాత వీడిపోయింది. ఆధ్యాత్మిక కేంద్రాలకు సరికొత్త వెలుగులు వచ్చాయి. నిఖార్సయిన హిందువు, మెండుగా భక్తిభావం ఉన్న కేసీఆర్ ముఖ్యమంత్రి కావడంతో ఆలయాలకు పూర్వవైభవం సంతరించుకున్నది.
చారిత్రక గుడులను అభివృద్ధి చేయడంతో పాటు వేలాది గుడులను నిర్మించారు. దేవుడి మాన్యానికి చట్టబద్ధమైన రక్షణ కల్పించారు. ఆలయాల భూములు కబ్జా కాకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ధూపదీప నైవేద్యం పేరిట నెలనెలా రూ.6 వేల చొప్పున ఇస్తున్నారు. ఇమామ్‌లు, మౌజన్లకు కూడా గౌరవ వేతనం ఇస్తూ మత సామరస్యానికి పెద్దపీట వేస్తున్నారు. కేసీఆర్ కారణంగా రాష్ట్రంలో ఆధ్యాత్మిక పరిమళం వెల్లివిరుస్తున్నది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు ఆధ్యాత్మిక దినోత్సవం నిర్వహించనున్నారు.
నిజామాబాద్, జూన్ 20(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలో ఆధ్యాత్మికం వెల్లివిరుస్తున్నది. సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పరిపాలనలో ఆలయాలకు మహర్దశ చేకూరుతున్నది. గతంలో దేవదేవుళ్లకు ధూపదీప నైవేద్యాలను సమర్పించుకోవాలంటే భక్తుల సహకారంతో లేదంటే అర్చకుల జేబులకే చిల్లులు పడేది. అలాంటి పరిస్థితి ఇప్పుడు పూర్తిగా పోయింది. ప్రభుత్వమే తెలంగాణ పల్లెలోని దేవాలయాలను ఆదరిస్తున్నది. దేవుళ్లకు నిత్య పూజలు చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధూపదీప నైవేద్యం పథకాన్ని తీసుకువచ్చింది. ఇందుకోసం నెలకు రూ.6వేలు చొప్పున ప్రభుత్వమే నిధులను సమకూర్చి ఆయా గుడులకు అందిస్తున్నది. అర్చకుల అకౌంట్లోనే ఈ డబ్బును ప్రతి నెలా జమ చేస్తున్నది. సమైక్య పాలనలో తెలంగాణ గ్రామాల్లోని దేవాలయాలను పట్టించుకున్న నాథుడే లేడు. అలాంటిది కేసీఆర్ పాలనలో ఆలయాలకు పెద్దపీట దక్కుతున్నది. అంతేకాకుండా ప్రముఖ క్షేత్రాల అభివృద్ధికి, ఆలయాల్లో సౌకర్యాల కల్పనకు సైతం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నది.
ఆలయాలకు ఆలంబన..
ఎన్నో ఏండ్లుగా ప్రజల ఆదరణకు నోచుకుంటున్న పుణ్య ప్రదేశాలను ఉన్నతీకరించే ప్రయత్నం కేసీఆర్ ప్రభుత్వంలోనే జరుగుతున్నది. గతంలో కాంగ్రెస్ పాలకులు కేవలం దేవాదాయ భూములను కబ్జాలు చేయడానికే ఆసక్తి చూపారు. ఎక్కడా గుడులకు పెద్దపీట వేసి వాటిని అభివృద్ధి చేయలేదు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 2014 నుంచి నేటి వరకు ధూపదీప నైవేద్యం కింద నెలకు రూ.6వేల చొప్పున 407 ఆలయాలకు రూ.24.42 లక్షలు నిధులను సర్కారు విడుదల చేస్తున్నది. అంతేకాకుండా కామన్ గుడ్ ఫండ్‌లో భాగంగా 148 దేవాలయాలకు ఉభయ జిల్లాల్లో మహర్దశ చేకూరింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు రూ.40.49కోట్లు మేర నిధులను ఆలయాలకే ఖర్చు చేశారు. దేవాలయాల అభివృద్ధి కోసం గ్రామస్తుల వాటా రూ.2.50లక్షలు చెల్లిస్తే రూ.10లక్షల చొప్పున సర్కారు ద్వారా నిధులు మంజూరైన ఆలయాలు సైతం 111 వరకు ఉన్నాయి. ఇలా రూ.10.55కోట్లు ఉభయ జిల్లాలోని ఆలయాలకు చేరాయి. పండుగలకు సర్వాంగ సుందరంగా దేవాలయాలను ముస్తాబు చేయడంతోపాటు స్థానిక ఎమ్మెల్యేల సహకారంతోనూ అనేక ఆలయాలు ఆధ్యాత్మికతతో వెల్లివిరిస్తున్నాయి.
దేవాదాయ భూములకూ రక్షణ…
దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల భూములను కాపాడేందుకు ప్రభుత్వం కంకణబద్ధులై పని చేస్తున్నది. ఆలయాల పరిధిలో ఉన్న భూములెన్ని? కబ్జాకు గురైన వివరాలేంటి? ప్రస్తుతం ఆధీనంలో ఉన్నవి ఏవేవి? అన్న కోణంలో పరిశీలించారు. ఇందులో వందలాది దేవాలయాల పరిధిలో విలువైన సాగు భూములు కబ్జాకు గురయ్యాయి. ప్రముఖ దేవాలయాలతోపాటు గ్రామ పంచాయతీల్లోని పురాతన ఆలయాలకు సంబంధించిన భూముల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం బయటికి తీసింది. ఇలా వెలుగు చూసిన దేవాదాయ, ధర్మాదాయ భూములను దేవుడి పేరిటే రికార్డుల్లోకి హక్కు పత్రాలను కల్పించి చట్టబద్ధ రక్షణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఫలితంగా వందలాది భూములన్నింటినీ కబ్జారాయుళ్ల చేతుల్లో నుంచి విముక్తి కల్పించడంతోపాటు ప్రస్తుతం ఆధీనంలో ఉన్న భూములను ఇతరులెవ్వరూ కన్నెత్తి చూడకుండా చర్యలు తీసుకున్నది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో 228.21 ఎకరాలను ఈ మేరకు గుర్తించారు. విలువైన భూములను స్వాధీనం చేసుకోగా వీటన్నింటినీ గెజిట్లోనూ ప్రభుత్వం నమోదు చేసింది. గెజిట్‌లో దేవాదాయ భూముల వివరాలు నమోదు చేయడంతో కబ్జా చేయడానికి, అన్యాక్రాంతం కావడానికి అవకాశమే ఉండకుండా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
సాంస్కృతిక గౌరవం…
తెలంగాణ సంస్కృతి, భాషా, పండుగలు పరాయీకరణ నుంచి పూర్తిగా బయటపడి సొంత రాష్ట్రం సాధించుకున్నాక జోర్దార్గా సాగుతున్నాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, వాటి పరిరక్షణకు సీఎం కేసీఆర్ నడుం బిగించి ముందుకు సాగుతున్నారు. తెలంగాణ యాస, సంస్కృతిని అవహేళన చేసిన వారికి మనమేంటో చూపేలా కార్యాచరణతో పనిచేస్తున్నారు. బోనాలు, బతుకమ్మ పండుగలను ప్రభుత్వం రాష్ట్ర పండుగలుగా ప్రకటించింది. ఇన్నాళ్లూ ఆంధ్రా పాలకులు నిర్లక్ష్యం చేసిన ఈ పండుగలను సాంస్కృతిక గౌరవంతో ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్నది. ప్రకృతిని ఆరాధిస్తూ తెలంగాణ మహిళలు జరుపుకొనే బతుకమ్మ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది రోజులపాటు ప్రభుత్వమే నిర్వహిస్తున్నది. అందుకోసం రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో బతుకమ్మ నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నది.
సీఎం కేసీఆర్ హయాంలోనే దేవాలయాల అభివృద్ధి
సీఎం కేసీఆర్ హయాంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యత పెరిగింది. దేవాలయాల అభివృద్ధికి విస్తృత చర్యలు చేపడుతున్నారు. ఆలయాల్లో వసతులు, సౌకర్యాలు మెరుగుపడుతున్నాయి. పదవీ విరమణ అనంతరం కూడా అర్చకులకు ఆలయాల్లో సేవలు అందించే మహద్భాగ్యం కల్పించిన సీఎం కేసీఆర్‌కు బ్రాహ్మణ సమాజం ఆశీస్సులు ఉంటాయి. బ్రాహ్మణులకు గౌరవం కల్పించి, మమ్మల్ని గుర్తించింది కేసీఆర్ మాత్రమే. గతంలో ఏ నాయకుడు, ఏ పార్టీ తమను ఆదరించలేదు.
– బెంబ్రేకర్ ప్రవీణ్ కుమార్ మహరాజ్, మారుతీ మందిరం అర్చకులు
ధూపదీప నైవేద్య పథకం హర్షణీయం..
శక్కర్‌నగర్, జూన్ 20: గ్రామ గ్రామాన ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం ప్రత్యేక పథకాన్ని ఏర్పాటు చేసి గౌరవ వేతనం అందించడం హర్షణీయం. తొమ్మిదేండ్లలో ఆలయాల అభివృద్ధికి విశేష కృషి జరిగింది. మరోవైపు బ్రాహ్మణుల స్థితిగతులు గుర్తించి సీఎం కేసీఆర్ అందిస్తున్న సేవలు ఎనలేనివి. ఆలయాల అభివృద్ధి, బ్రాహ్మణ సమాజ హితం కోసం పనిచేస్తున్న సీఎం కేసీఆర్‌కు మా సహకారం ఎల్లవేళలా ఉంటుంది.
– గణేశ్ శర్మ, శ్రీ ఏకచక్రేశ్వర శివమందిరం అర్చకుడు, బోధన్
ఆలయాల అభివృద్ధికి సర్కారు కృషి అమోఘం
మాచారెడ్డి, జూన్ 20 : ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. గతంలో ఏ ప్రభుత్వాలూ ఆలయాలను పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో ఆధ్యాత్మికం ఎంతో అభివృద్ధి చెందింది. గతంలో ధూపదీప నైవేద్యానికి నోచుకోని ఎన్నో ఆలయాలను సీఎం కేసీఆర్ గుర్తించి వాటికి పూర్వవైభవాన్ని తీసుకొచ్చారు.
– వేల్పూరి పరంధామాచార్యులు, చుక్కాపూర్ ఆలయ అర్చకుడు
కేసీఆర్‌తోనే గ్రామీణ ఆలయాలకు మహర్దశ
శక్కర్‌నగర్, జూన్ 20: సీఎం కేసీఆర్ కృషితోనే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆలయాలకు మహర్దశ వచ్చింది. ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల కింద పారితోషికాలు అందించే ప్రక్రియను ప్రారంభించిన గొప్ప సీఎం. గతంలో ఏ ప్రభుత్వం యోచించని విధంగా పురాతన ఆలయాల్లో సైతం నిత్యం దీపంతోపాటు నైవేద్యాలు సమకూర్చడంతో బ్రాహ్మణులకు ఉపాధికల్పిస్తుంది. ఆలయాలు నిరాదరణకు గురికాకుండా నిత్య పూజలు జరిపించేందుకు సీఎం చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి బ్రాహ్మణ సమాజం తరఫున కృతజ్ఞతలు.
– శ్రీ రామదాసి సురేశ్ ఆత్మారాం మహరాజ్, చిలుకూరు శివాలయం ప్రధాన అర్చకుడు
మైనార్టీల అభ్యున్నతికి..
మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. గంగా, జమునా, తెహజీబ్‌కు ప్రతీకగా నిలిచింది. అందులో భాగంగా ఇమామ్, మౌజన్ల గౌరవ వేతనాలను పెంచి వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నది. రాష్ట్రంలోని ఒక్కో ఇమామ్‌కు రూ.9,997, మౌజన్లకు రూ.5వేల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తున్నది. రంజాన్ పండుగను పురస్కరించుకొని నిరుపేద ముస్లిములకు తోఫా(దుస్తులు)ను అందజేస్తూ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నది. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాతే రంజాన్‌ను పురస్కరించుకొని అధికారికంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా మదర్సాలు, మసీదులు, షాదీఖాన తదితర అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నది.
ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం
తెలంగాణ ప్రభుత్వంలో దేవాలయాలకు మంచి ఆదరణ లభిస్తున్నది. ప్రజల అవసరాలను గుర్తించడంతోపాటు నిధులను వెచ్చించడం ద్వారా నిత్య కల్యాణం పచ్చతోరణం అన్నట్లుగా ఆలయాలు కొత్తశోభను సంతరించుకుంటున్నాయి. ప్రతి నెలా మంజూరు చేసే దూప దీప నైవేద్యం పథకం పకడ్బందీగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నాం. దేవాదాయ శాఖ సిబ్బంది ఆలయాలను తనిఖీ చేస్తూ దూప దీప నైవేద్యాలు సక్రమంగా జరుగుతున్నాయా? లేదా? అన్నది పరిశీలిస్తున్నాం. ఉమ్మడి జిల్లాలో ఆలయాల అభివృద్ధి మెరుగ్గా జరుగుతున్నది.
– నాయిని సుప్రియ, ఉమ్మడి జిల్లా సహాయ కమిషనర్, దేవాదాయ శాఖ
రాష్ట్రం వచ్చాకే ఆధ్యాత్మిక వైభవం
భిక్కనూరు,జూన్ 20: రాష్ట్రం రాకముందు ప్రధాన దేవాలయాలతోపాటు గ్రామీణ ఆలయాలను పట్టించుకున్న నాథుడే లేడు. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాతే రాష్ట్రంలో ఆధ్యాత్మిక వైభవం సంతరించుకున్నది. అన్ని ఆలయాలకు నూతన శోభ వచ్చింది. అర్చకులకు గౌరవ వేతనం, ధూపదీప నైవేద్య పథకం అందిస్తూ ఆలయాలకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారు. యాదాద్రి, వేములవాడ, కొండగట్టు తదితర ప్రధాన ఆలయాలను అభివృద్ధి చేస్తూ తెలంగాణలో ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా కృషి చేస్తున్నారు. దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు మా ఆశీస్సులు ఉంటాయి.
– కొడకండ్ల రామగిరి శర్మ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం
ఆలయాలకు పూర్వవైభవం
ఖలీల్‌వాడి, జూన్ 20: తెలంగాణ వచ్చిన తర్వాతే ఆలయాలకు పూర్వ వైభవం వచ్చింది. గతంలో చాలా ఆలయాలు ధూపదీప నైవేద్యాలకు నోచుకోని దుస్థితి ఉండేది. సీఎం కేసీఆర్ హయాంలో ఆలయాలు అభివృద్ధి చెందాయి. సీఎం కేసీఆర్ చేస్తున్న ధార్మిక కార్యమ్రాలు చాలా బాగున్నాయి. వేదశాస్త్ర పండితులకు ప్రతి నెలా ఇస్తున్న గౌరవ భృతిని రూ.2500 నుంచి రూ.5వేలకు పెంచారు. దేవాలయాల నిర్వహణకు పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వమే. ఆధ్యాత్మికతకు పెద్దపీట వేస్తూ ధూపదీప నైవేద్యాలకు రూ.10 వేల వరకు ఇస్తుండడం విశేషం. హిందూ ధర్మం, సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణకు సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారు.
– మకరంద్,నీలకంఠేశ్వర ఆలయ అర్చకుడు