NEET | శక్కర్ నగర్ : బోధన్ పట్టణంలో ఆదివారం నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్షకు ఆలస్యంగా వచ్చిన ముగ్గురు విద్యార్థులు వెను తిరిగి వెళ్లాల్సి వచ్చింది. నెలల తరబడి కష్టపడి చదివి.. నిమిషాల తేడాతో పరీక్షా కేంద్రానికి చేరుకోగా అప్పటికే గేట్లు మూసి ఉంచడం వారిని తీవ్ర ఆవేదానికి గురిచేసింది. నీట్ పరీక్ష కేంద్రానికి చేరుకున్న ఓ విద్యార్థిని, ఇరువురు విద్యార్థులు గేట్లకు తాళాలు గమనించి తమను లోనికి పంపాలంటూ అభ్యర్థించారు.
కాగా నిబంధనల మేరకు నిర్దిష్ట సమయానికి విద్యార్థులను పంపి తాళాలు వేసామంటూ.. ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను లోనికి పంపడం కుదరదంటూ తేల్చి చెప్పడంతో విద్యార్థులు పరీక్ష కేంద్రం వద్ద రోదించారు. అయితే సదరు విద్యార్థులను బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు సముదాయించి అక్కడి నుంచి పంపాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు
బోధన్ పట్టణంలో ఆదివారం నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్ష సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రభుత్వ డిగ్రీ జూనియర్ కళాశాల కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తును సాయంత్రం వరకు పకడ్బందీగా నిర్వహించారు.
పోలీసు బందోబస్తులో బోదన్ ఏసీపీ శ్రీనివాస్, పట్టణ సీఐ వెంకటనారాయణతో కలిసి పర్యవేక్షించారు. రెండు కేంద్రాలకు గాను 843 మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు అధికారులు వెల్లడించారు. అయితే పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థుల రోదనలు పలువురిని కలచివేశాయి. ఇలాంటి పరీక్షల సమయంలో కొంత సమయం సలలింపు ఇవ్వాలని పలువురు కోరారు.