బోధన్, మే 28: అడవిలో ఉండాల్సిన జింకలు.. జనావాసాల్లోకి రావడంతో మృత్యువాత పడుతున్నాయి. గ్రామాల్లోకి వచ్చిన జింకలను కుక్కలు వేటాడి చంపేస్తున్నాయి. దీనికి ఇసుక మాఫియా కూడా కారణమవుతున్నదని ప్రజలు ఆరోపిస్తున్నారు. పచ్చని పచ్చిక బయళ్లలోనూ, పొదలమాటున ఉంటూ హాయిగా సంచరించాల్సిన జింకలు ఇప్పుడు జనారణ్యంలోకి వచ్చి.. కుక్కల వేటకు బలవుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని మంజీరా తీరం జింకలు, అనేక రకాల పక్షులకు నిలయం.
ఇక్కడ జింకలతోపాటు కృష్ణ జింకలు విహరిస్తూ ఉంటాయి. నాలుగు రోజులుగా కొన్ని జింకలు, జింక పిల్లలు గ్రామాల వైపు రావడం, కుక్కల దాడిలో మృత్యువాత పడడం ఆందోళన కలిగిస్తున్నది. ఉమ్మడి కోటగిరి మండలంలో నాలుగు రోజులుగా కొనసాగుతున్న జింకల మృత్యుఘోష పలువురిని కలిచివేస్తున్నది. గత ఆదివారం పొతంగల్ మండలం సోంపూర్ శివారులో కృష్ణ జింకపై కుక్కలు దాడిచేసి చంపేశాయి. ఆ మరుసటి రోజు కోటగిరి మండలం యాద్గార్పూర్లో మరో కృష్ణజింక కుక్కల వేటతో మృత్యువాత పడింది. మంగళవారం సోంపూర్‌లో మరో జింక పిల్లను కుక్కలు వేటాడగా.. అదృష్టవశాత్తు అది పెద్దగా గాయపడకపోవడంతో దానికి అటవీశాఖ అధికారులు ప్రాథమిక చికిత్స అందించి అడవిలో వదిలిపెట్టారు.
బుధవారం కూడా మరో కృష్ణ జింకను కుక్కలు వేటాడి చంపేశాయి. వరుసగా జరుగుతున్న ఈ సంఘటనలతో మంజీరా తీర ప్రాంత ప్రజలు, జంతు ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. జింకల సహజ ఆవాసాలు అనేక కారణాలతోపాటు ఇసుక మాఫియాతో చెదిరిపోతుండడంతో అవి గ్రామాల వైపు వస్తున్నాయని వారు అంటున్నారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు బురద గుంటలు ఏర్పడడంతో అవి కుక్కలబారి నుంచి తప్పించుకోలేకపోతున్నాయి. ఇటీవల గ్రామాల్లో కుక్కల బెడద పెరిగింది. గ్రామ పంచాయతీలు నిధులు లేని కారణంగా కుక్కల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నాయి.
ఇసుక మాఫియా విధ్వంసం ఇది..
ఇసుక కోసం మంజీరా తీరంలో జరుగుతున్న అక్రమ తవ్వకాలు, రాత్రింబవళ్లు ఇసుక రవాణా కోసం తిరిగే వాహనాల రణగొణ ధ్వనులు వన్యప్రాణులకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ప్రశాంతంగా ఉండే మంజీరా తీరం ఇసుక అక్రమ రవాణాతో అల్లకల్లోలంగా మారుతున్నది. సహజ ఆవాసాల్లో నిత్యం సంచరించే జింకలకు ఇసుక మాఫియా ఫలితంగా ప్రాణభయం పట్టుకున్నదని, ఎటువెళ్లాలో తెలియని పరిస్థితి ఎదుర్కొంటున్నాయని పర్యావరణవేత్తలు అంటున్నారు. బోధన్ డివిజన్లోని మంజీరా తీరం వెంట ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఇందులో ప్రభుత్వ అనుమతి పొందిన ఇసుక క్వారీల సంగతెలా ఉన్నా.. పొతంగల్ మండలంలోని మంజీరా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి.
దొంగచాటుగా రాత్రుళ్లూ ఇసుకను తవ్వడం, ట్రాక్టర్లు, ఇతర వాహనాల్లో నది నుంచి ఇతర ప్రాంతాలకు తరలించడం జరుగుతున్నది. ఇదే పరిస్థితి సాలూర, బోధన్, రెంజల్ మండలాల్లో కూడా ఉన్నది. ఇసుక అక్రమ రవాణాదారులు నదిలోకి, నదిలో ర్యాంప్‌ల పేరిట రోడ్లను ఏర్పాటుచేసుకోవడం కోసం పొదలు, పచ్చిక బయళ్లను తొలగిస్తున్నారు. దీంతో జింకలే కాకుండా ఆ నదీ ఈ తీరంలో విహరించే అనేక పక్షి జాతులు ఇప్పుడు కనిపించకుండా పోయాయి. మంజీర తీరంలోని ఈ ప్రకృతి విధ్వంసానికి అడ్డుకట్టవేసేంత వరకు వన్యప్రాణులు మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్నది,
పంచాయతీలకు లేఖలు..
జింకలను కుక్కలు వేటాడడం, వాటిని చంపడం బాధ కలిగిస్తున్నది. గ్రామాల్లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. పంచాయతీలు కుక్కల బెడదను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఈ విషయమై మా శాఖ ఉన్నతాధికారులు పంచాయతీలకు లేఖలు పంపాలని యోచిస్తున్నారు.
– సురేశ్, సెక్షన్ ఆఫీసర్, అటవీశాఖ
కుక్కల దాడిలో మరో జింక మృతి
పొతంగల్, మే 28: మండలంలోని టాక్లీ గ్రామంలో ఓ జింక కుక్కల వేటకు బలైంది. మేత కోసం బుధవారం వ్యవసాయ పొలాల్లోకి వచ్చిన జింకపై కుక్కలు దాడిచేశాయి. దీంతో అది అక్కడికక్కడే మృతిచెందింది. విషయాన్ని స్థానికులు అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. దీంతో అక్కడికి చేరుకొని పంచనామా నిర్వహించినట్లు అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ సురేశ్ తెలిపారు.