ఎల్లారెడ్డి/లింగంపేట, ఫిబ్రవరి 11: ఎల్లారెడ్డిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్నది. స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ తన పీఏలు, అనుచరులతో కలిసి పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లడం, దీన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ధర్నాకు దిగారు. పోలీసులు ఆయనను బలవంతంగా అదుపులోకి తీసుకునే క్రమంలో జాజాలకు గాయాలయ్యాయి. మదన్మోహన్ తన అనుచరులతో పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లారు. ఈ విషయం తెలిసిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అక్కడికి చేరుకున్నారు. ఏ అర్హతతో మదన్మోహన్ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారని అక్కడున్న పోలీసులను ప్రశ్నించారు. వారు స్పందించక పోవడంతో బస్టాండ్ వద్ద జాజాల ధర్నాకు దిగారు. ఆయనను పోలీసులు అరెస్టు చేసి, నాగిరెడ్డిపేట ఠాణాకు తరలించారు.
ఈ సందర్భంగా జాజాల మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యే పోలింగ్ బూత్‌లకు వెళ్లి ఓటర్లను భయభ్రాంతులు గురి చేశారని మండిపడ్డారు. డీఎస్పీ, సీఐ, ఎస్సైలు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని పని చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే ఆగడాలపై పోలీసులకు సమాచారమిస్తే పట్టించుకోలేదని తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందే వార్డుల్లో మదన్మోహన్ అనుచరులు తిరుగుతూ భయాందోళనకు గురి చేశారన్నారు. బీఆర్ఎస్ గెలుస్తుందని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలియడంతోనే ఎమ్మెల్యే గూండాగిరికి దిగాడని విమర్శించారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లను ప్రలోభపెడుతున్న వారిని అరెస్టు చేయకుండా, దాన్ని నిలదీసిన తమను అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకోవడంపై ఆయన మండిపడ్డారు. అంతకు ముందు ఎల్లారెడ్డిలో జాజాలను పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో మాజీ ఎమ్మెల్యే కుడిచేయికి గాయమైంది.