వినాయక నగర్(నిజామాబాద్ ) : దోపిడి దొంగలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విజృంభిస్తున్నారు. రాత్రి నిజామాబాద్ (Nizamabad) జిల్లా కేంద్రం, పిట్లం (Pitlam) మండలంలో రెండు ఇండ్లలో చోరీలకు పాల్పడ్డారు. నిజామాబాద్ నగరంలోని ఆరో టౌన్ పరిధిలోని ఆటోనగర్లో నివాసముండే మొహమ్మద్ ఇలియాస్ గురుకులంలో విధులు నిర్వర్తిస్తున్నారు. శుక్రవారం రాత్రి ఆయన ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించిన దుండగులు దోపిడీకి పాల్పడ్డారు.
ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడి నగలు ( Jewelry), నగదు దోచుకెళ్లారు. చోరీ జరిగినట్లు గమనించిన ఇంటి యజమాని శుక్రవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. బీరువాలో ఉన్న ఎనిమిది తులాల బంగారు నగలు, రూ. 29 ,500 నగదు దోచుకెళ్లారు. ఘటన స్థలాన్ని సౌత్ రూరల్ సీఐ సురేష్ తో పాటు ఎస్సై సందర్శించారు. ఈ సందర్భంగా క్లూస్ టీం తో ఆధారాలు సేకరించారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
పెద్ద కొడప్గల్ : పిట్లం (Pitlam) మండలం సిద్ధాపూర్ తండాలో దొంగలు రాత్రి బీభత్సం సృష్టించారు. కేతావత్ గోపాల్ అనే వ్యక్తి ఇంటి బయట నిద్రిస్తుండగా అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు రాడ్లతో దాడి చేసి, తన భార్యకు సంబంధించిన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారని బాధితులు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు .