నాగిరెడ్డిపేట, జూన్ 18: బహిర్భూమికి వెళ్లిన వ్యక్తిపై కత్తులతో దాడి చేసి గొంతు, మర్మాంగాలపై కత్తిపోట్లు వేసి హత్యచేసేందుకు యత్నించిన ఘటన నాగిరెడ్డిపేట మండలం రాఘవపల్లి గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకున్నది. గ్రామానికి చెందిన నార్ల నాగయ్య(55)ను గుర్తుతెలియని వ్యక్తులు రాత్రివేళ కత్తులతో దాడిచేసి గాయపర్చారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న నాగయ్యను చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఘటనపై ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. నాగయ్య రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బహిర్భూమికి వెళ్లాడు. గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై కత్తులతో దాడిచేసి గొంతు కోసి గాయపరిచారు. అదే సమయంలో ద్విచక్రవాహనంపై వ్యవసాయ బోరువద్దకు వెళ్లి వస్తున్న నాగయ్య బావమరిది నార్ల సంగయ్య, పోచయ్యకు దారిపక్కన రక్తపుమడుగులో నాగయ్య కనిపించాడు. గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు చేరుకొని దవాఖానకు తరలించారు.
చికిత్స పొందుతున్న నాగయ్యను విచారించగా.. రెండేండ్ల క్రితం మానసిక వికలాంగురాలైన తన కూతురుపై లైంగిక దాడి చేసి, జైలుకు వెళ్లివచ్చిన జూకంటి రమేశ్, పుట్టి శ్యామ్‌తోపాటు జూకంటి సాయిలు తనపై కత్తితో దాడి చేసినట్లు చెప్పారు. నాగయ్య బావమరిది సంగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. ఘటనా స్థలాన్ని మంగళవారం క్లూస్‌టీం పరిశీలించి ఆధారాలను సేకరించారు. హత్యాయత్నంపై పలు అనుమానాలు ఉండడంతో పోలీసులు గ్రామస్తులను విచారిస్తున్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండేండ్ల క్రితం నాగయ్య కూతురిపై లైంగిక దాడి కేసులో గ్రామానికి చెందిన నలుగురు జైలుకు వెళ్లారు. మరికొద్ది రోజుల్లో కేసు హియరింగ్‌కు వస్తుందని తెలిసి అడ్డుగా ఉన్న నాగయ్యను చంపితే కేసును అడిగేవారు ఉండరనే ఆలోచనతోనే హత్య చేసేందుకు కుట్ర పన్నారని గ్రామస్తులు తెలిపారు. విచారణ చేపడుతున్నామని, వాస్తవాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు.