‘సమైక్య రాష్ట్రంలో కారుచీకట్లను చూశాం…స్వరాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ సర్కారు వెలుగులు తీసుకొచ్చిండు. ఇండ్లు, పొలాల్లో 24గంటలపాటు కోతలు లేని కరెంటు ఇచ్చిండు. పదేండ్ల పాలనలో ప్రజలకు కరెంటు రంది లేకుండా చేసిండు. రాత్రిపూట బాయికాడికి పోకుండా పగటి పూట కట్క వొత్తంగనే బోరు పారేటట్లు చూసిండు. జిరాక్సు సెంటర్ నుంచి ఫ్యాక్టరీల దాకా మంచిగ నడిచేటట్లు కరెంటు ఇచ్చిండు. అలాంటి సార్‌పై నిందలు మోపడం సరికాదు. ఇప్పటికైనా కేసీఆర్ సారు ఇచ్చినట్లు కరెంటు మంచిగ ఇచ్చి మాట్లాడాలె..’ అని సూచిస్తున్నారు ఉమ్మడి జిల్లా రైతులు, ప్రజలు. కేసీఆర్ హయాంలో కరెంటు సరఫరాపై వారి అభిప్రాయాలను నమస్తే తెలంగాణతో పంచుకున్నారు.
రెంజల్, జూన్ 23: కేసీఆర్ పదేండ్ల పాలనలో కరెంటు ఇబ్బందులు రాలేదు. అంతకుముందు ఏ టైంల కరెంటు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియకపోతుండె. కరెంటు సరిగ్గా లేక పనులు ఆగిపోతుండె. ఇప్పుడు కొత్తగా వచ్చిన సర్కారుల కరెంటు సక్కగ వస్తలేదు. పగటిపూట 10-12సార్లు కరెంటు పోతున్నది. లోవోల్టేజీతో పనులన్నీ ఆగిపోతున్నాయ్. చినుకుల వర్షం వచ్చినా కరెంటు పోతున్నది. ఇప్పుడే ఇట్ల ఉంటే వానకాలం మొత్తంల కరెంటు ఎట్ల ఉంటదో తలచుకుంటే భయమైతున్నది. కేసీఆర్ సారు ఉన్నప్పుడు కరెంటు మంచిగుండె.
రెంజల్, జూన్ 23 : నేను కార్పెంటర్ పని చేస్త. తెలంగాణ రాక మునుపు కరెంటు కావాలంటే రోడ్ల మీద, సబ్స్టేషన్ల ధర్నాలు చేసేటోళ్లం. కరెంటు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేటోళ్లం. రోజులో మూడు లేదా నాలుగు గంటల కరెంటు వస్తే మస్తు అయితుండె. తెలంగాణ అచ్చినంక కేసీఆర్ సారు కరెంటు బాధను మొత్తం తీర్చిండు. కోతలు లేకుండా 24గంటలు కరెంటు ఇచ్చిండు. కరెంటు ఎక్కడి నుంచి తెచ్చిండో తెల్వదు కానీ మా లెక్క పనిచేసుకొని బతికేటోళ్లను ఆదుకున్నడు. ఇప్పుడు పొద్దంతా కరెంటు పోవుడు.. వచ్చుడు.. ఇదే ముచ్చట. ఇగ తీసుకున్న ఆర్డర్ కస్టమర్‌కు ఇవ్వాలె కాబట్టి రాత్రిపూట నిద్రను తట్టుకొని పనిచేస్తున్నం.
ఎడపల్లి, జూన్ 23 : ఉమ్మడి రాష్ట్రంలో చాలీచాలని కరెంటుతో అనేక ఇబ్బందులు పడ్డం. రాత్రి పగలు అనే తేడా లేకుండా బావికాడికి పోయి కరెంటు ఎప్పుడు వస్తదా అంటూ ఎదురుచూసేవాళ్లం. కేసీఆర్ వచ్చినంక రైతులకు ఎలాంటి సమస్యలు ఉండొద్దని 24గంటలు కరెంటు ఇచ్చిండు. ఆయన ఉన్నప్పుడు లోవోల్టేజీ లేదు. మోటర్లు కాలుడు తగ్గినయ్. పగటిపూటనే మోటర్లు నడిపించేటోళ్లం. దీంతో రెండు పంటలను మంచిగ పండించినం. రైతులకు మంచిగ జేసిన కేసీఆర్‌ను నిందించడం సరైంది కాదు. ఇప్పుడొచ్చినోళ్లు ఎన్కటి రోజులను గుర్తుకు తెస్తుండ్రు. కరెంటు పోవుడు షురూ అయ్యింది.
ఎడపల్లి, జూన్ 23 : కేసీఆర్ సార్ సల్లగుండ. ఆయన ఉన్నప్పుడు కరెంట్ పోయిందన్న ముచ్చటే లేకుండె. కరెంటు కోతల గురించే మరిచిపోయినం. అంతకు ముందు గంటలకొద్దీ కరెంటు రాకపోతుండె. ఇగ మా గల్లీల బోరు నల్లాలు ఎప్పుడంటే అప్పుడు ఆన్ చేసి నీళ్లు పట్టుకునేటోళ్లం. కరెంట్ పోక పోతుండె. కరెంట్ బాధలు లేకుండె. మా మనువండ్లు రాత్రిపూట సక్కగా రాసుకొని చదువుకుంటుండె. రాత్రి కూడా కరెంట్ ఉంటుండె. కేసీఆర్ 24 గంటల కరెంటు ఇచ్చి మాకు ఎంతో మేలు చేసిండు. ఇప్పుడొచ్చిన సర్కారోళ్లు కరెంటు కోతలు షురూ చేసింది. రాత్రిపూట వాన చినుకు పడితే కరెంటు పోతుంది. చీకట్లో జాగారం చేస్తున్నం.