ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండో విడుత రుణమాఫీపై గందరగోళం నెలకొన్నది. మొదటి విడుత మాదిరిగానే కొంతమంది రైతులకే మాఫీ వర్తించడంతో అన్నదాతల్లో అయోమయం నెలకొన్నది. రూ.లక్షన్నర వరకు పంట రుణమాఫీ జాబితాను ప్రకటించగా అర్హులమైనా పేరు రాలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు మొదటి విడుతలో మాఫీ రాని రైతులు సైతం రెండో విడుత కోసం ఎదురుచూడగా వారికీ నిరాశే మిగిలింది. మలివిడుత రుణమాఫీ ప్రక్రియ మొదలైనా తమ విషయంలో ఎలాంటి స్పష్టత రావడం లేదని వాపోతున్నారు. బ్యాంకులు, వ్యవసాయ అధికారులను అడిగినా ఫలితం ఉండడం లేదని పేర్కొంటున్నారు
మాక్లూర్, జూలై 31: గత ఏడాది మాక్లూర్ ఇండియన్ బ్యాంకులో రూ.20వేల పంట రుణం తీసుకున్న. మొదటి విడుతలో మాఫీ కాలేదు. వారం రోజులు బ్యాంకు చుట్టూ తిరిగిన.. ఇగ అస్తది.. అగ అస్తది అని చెప్పిండ్రు. మాఫీ మాత్రం కాలేదు. అన్నీ సక్రమంగా ఉన్నా మొదటి విడుతలో నా పేరు రాలేదు. రూ.20వేలు కూడా మాఫీ కాలే.. కానీ రూ.లక్షా50వేలు మాఫీ అనుకుంట రెండు విడుత లిస్టు పంపిండ్రు. అందులో కూడా నా పేరు లేదు. ఆశ్చర్యం వేసింది. ప్రభుత్వం మా గోస విని సమస్య పరిష్కరించాలి. అధికారులను అడిగితే ఇండియన్ బ్యాంకులో రుణాలు తీసుకున్న రైతులకు సమస్య ఉన్నది.. ఎదురు చూడమని చెబుతున్నరు.
-బూరోల్ల లక్ష్మన్, రైతు, ముల్లంగి(బీ)
నేను అయిలాపూర్ యూనియన్ బ్యాంకులో రూ.లక్షా 30వేల రుణం తీసుకున్నాను. నాకు రుణమాఫీ రాలేదు. మొదటి విడుత వస్తదేమోనని ఎంతో ఆశతో చూశాను. ఈ రెండో విడుత కూడా అదే ఆశతో ఎదురు చూసినా నిరాశే మిగిలింది. రుణమాఫీ ప్రక్రియ అంతా గందరగోళంగా ఉన్నది. కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకపోవడం సరికాదు. అర్హులైన రైతులందరికీ ప్రభుత్వం రుణమాఫీ చేయాలి. రుణమాఫీ జరగలేదని బ్యాంకు, వ్యవసాయ కార్యాలయానికి వెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదు.
– ముస్కు రాంరెడ్డి, రైతు, తల్వేద
మాక్లూర్, జూలై 31: రూ.లక్షలోపు ఉన్నోళ్లందరికీ మాఫీ అన్నరు. మొదటి విడుతలో నాపేరు రాలే. రెండో విడుతల కూడా రాలే.. నాకు రెండు ఎకరాల పొలం ఉన్నది. గత ఏడాది ఇండియన్ బ్యాంక్‌లో రూ.90వేలు పంట రుణం తీసుకున్న. కాంగ్రెస్ ప్రభు త్వం, అధికారులు రూ.లక్షలోపు ఉన్న వారిని పట్టించుకోవాలె. అంతా గజిబిజిగా ఉన్నది. బ్యాంకు అధికారులు మాచేతుల్లో ఏమీ లేదంటున్నరు. నాకు మాఫీ అయితుందో లేదోనని టెన్షన్‌గా ఉన్నది.
– బోత్తోల్ల భూమన్న,రైతు, మాక్లూర్
చందూర్ , జూలై 31: నా పేరు ఎడ్ల సందీప్. మాది చందూర్. 2020 సెప్టెంబర్‌లో డీసీసీబీలో రూ.లక్షా15 వేలు పంట రుణం తీసుకున్నా. రెండో విడుత రుణమాఫీ జాబితాలో పేరు వస్తుందని ఆశించా. నా పేరు రాలేదు. గత ప్రభుత్వంలో ఇలాంటి సమస్య రాలేదని, ఇప్పడెందుకు సమస్య వచ్చిందని అధికారులను ప్రశ్నిస్తే.. వినతిపత్రం అందించాలని చెబుతున్నారు. మాఫీ ఎందుకు కాలేదో, ఎప్పుడు అవుతుందో కూడా అధికారులు, బ్యాంకు మేనేజర్లు చెప్పడం లేదు.
రెంజల్, జూలై 31: రేవంత్‌రెడ్డి సర్కారు పంట రుణం మాఫీ చేస్తామని చెప్పి రైతుల మోచేతికి బెల్లం పెడుతుంది. గతేడాది రెంజల్ కెనరా బ్యాంక్‌లో రూ.లక్షన్నర రుణం తీసుకున్న. రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షన్నర రుణమాఫీ చేస్తామని ప్రకటించి మాట తప్పింది. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించి అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలి.
– వేమూరి వెంకటేశ్వర్రావు, రైతు, దండిగుట్ట గ్రామం
నందిపేట్, జూలై 31: నేను తల్వేద గ్రామంలోని యూనియన్ బ్యాంకులో రూ.లక్షా 30వేల పంట రుణం తీసుకున్నా. రుణమాఫీ జరుగుతుందని ఎంతో ఆశగా ఎదురుచూశా. కానీ రెండో విడుత రుణమాఫీ లిస్టులో నా పేరు రాలేదు. ప్రభుత్వం ఇష్టారీతిగా రుణమాఫీ చేస్తున్నది. అర్హులకు ఇవ్వకపోవడం అన్యాయం. మేము వ్యవసాయాన్నే నమ్ముకొని జీవిస్తున్నాం. మాలాంటి నిజమైన రైతులకు కచ్చితంగా రుణమాఫీ చేయాలి.
– కొట్టాల కలవ్వ, మహిళారైతు, తల్వేద, నందిపేట్