నిజామాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కొత్త రేషన్ కార్డుల మంజూరు చేయడంలో జాప్యం కొనసాగుతూనే ఉన్నది. అప్పుడూ.. ఇప్పుడూ అంటూ రాష్ట్ర ప్రభుత్వం కాలం వెల్లదీస్తున్నదే తప్ప సమయానికి కార్డులను జారీ చేయడం లేదు. బీపీఎల్, ఏపీఎల్ పేరిట మరో కొత్త పద్ధతికి తెర లేపడంతో లబ్ధిదారులను భయం వెంటాడుతున్నది. రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం సరఫరా మొదలవ్వడంతో రేషన్ కార్డులకు మరింత ప్రాధాన్యత పెరిగింది.
సన్న బియ్యం ధరలు బయటి మార్కెట్లో భారీగా ఉన్నాయి. రేషన్ షాపుల్లో ఈనెల నుంచి సన్న బియ్యం ఇస్తుండడంతో ప్రజలంతా ఆసక్తి చూపుతున్నారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో రేషన్ కార్డుల జారీ కూడా ఒకటి. అధికారం చేపట్టిన అనంతరం మాట మారుస్తూ.. నిబంధనల బూచీని ముందు పెట్టి ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారు.
ఆదాయ ధ్రువీకరణకు పరిమితిని పెంచకుండానే బీపీఎల్, ఏపీఎల్ పేరిట కొత్త విధానాన్ని తీసుకు వస్తుండడంపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతున్నది. రేషన్ కార్డుల జారీలో పారదర్శకత పాటించాలని, నిబంధనల పేరిట వేధించొద్దని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గ్రామ సభల పేరిట హడావిడి చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రేషన్ కార్డుల జారీలో ఎలాంటి ముందడుగు వేయలేదు. గ్రామసభల రోజు నామమాత్రంగా కొన్ని కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసి చేతులు దులుపుకున్నది.
ఉమ్మడి జిల్లాలో 6.37లక్షల రేషన్ కార్డులు..
రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో భాగంగా పూటకోసారి ప్రభుత్వం విరుద్ధమైన ప్రకటనలు చేస్తుండడంతో ఆశావాహుల్లో అయోమయం నెలకొన్నది. కుటుంబ సభ్యుల పేర్లను రేషన్ కార్డుల్లో చేర్పించడానికి వచ్చిన మీ సేవ దరఖాస్తులను అధికారులు జిల్లా నుంచి పౌరసరఫరాల శాఖ కమిషనర్ లాగిన్‌కు పంపించారు. అక్కడ ఆమోదం లభిస్తే పేర్లు రేషన్ కార్డుల్లో చేరుతాయి. మొదటి బిడ్డ దరఖాస్తు పెండింగ్‌లో ఉండడంతో రెండో బిడ్డకు సంబంధించిన పేర్లను మీసేవ సైట్ తీసుకోవడం లేదు.
రెండో బిడ్డ కలిగిన సుమారు 40వేల మంది రేషన్ కార్డుల్లో పేర్ల నమోదుకు దరఖాస్తుల అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో 4,03,025 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. 12,83,215 మంది సభ్యులు ఉన్నారు. ప్రతి నెలా 7,450 మెట్రిక్ టన్నుల బియ్యం కోటా విడుదల అవుతున్నది. కామారెడ్డి జిల్లాలో ఆహార భద్రత కార్డులు 2,34,979 ఉన్నాయి. 8,04,432 యూనిట్లు ఉండగా బియ్యం కోటా ప్రతి నెలా 48.26లక్షల కిలోలుగా ఉన్నది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 6లక్షల 37వేల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపుగా 21లక్షల మంది సభ్యులున్నారు. కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తే ఈ సంఖ్య భారీగా పెరుగనున్నది. కానీ ప్రభుత్వం ఏం చేస్తుందో? వేచి చూడాల్సి ఉంది. అర్హతల పేరిట చాలా చోట్ల కార్డులను తొలగించడంపైనే దృష్టి పెడుతున్నట్లు తెలుస్తున్నది.
దరఖాస్తుదారుల్లో భయం.. భయం..
రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారిని ఆందోళన వెంటాడుతున్నది. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పూటకో మాట మాట్లాడుతున్నారు. కొత్త రేషన్ కార్డులను ఉగాది పర్వదినానికి అందిస్తామన్నారు. ఏప్రిల్ ఒకటి నుంచి చేతికి కొత్త కార్డులు వస్తాయని దరఖాస్తుదారులు ఆశగా ఎదురు చూశారు. కానీ పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. దరఖాస్తుదారుల అప్లికేషన్లు ఇంకా పరిశీలన దశలోనే ఉన్నాయి.
ప్రజాపాలనలో దరఖాస్తు చేసిన వారంతా రెండు నెలల క్రితం జరిగిన గ్రామ సభల్లోనూ మొర పెట్టుకున్నారు. కొత్తగా తమ పిల్లల పేర్లను చేర్చాలని విన్నవించారు. రోజులు గడుస్తున్నప్పటికీ పరిస్థితిలో మార్పు కానరావడం లేదు. రేషన్ కార్డుల జారీలో ఎలాంటి ముందడుగు పడడం లేదు. కొత్తగా వివాహం చేసుకుని, వేరే కాపురం ఉంటున్న కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసేందుకు పాత రేషన్ కార్డు నుంచి పేరును తొలగించుకున్నారు.
ఇప్పుడు రెంటికి చెడ్డా రేవడిలా వారి పరిస్థితి మారింది. అటూ పాత దాంట్లో పేరు పోగొట్టుకొని, ఇటు కొత్త రేషన్ కార్డులు చేతికి రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులను అడిగితే తమకేమి సంబంధం లేదని చెబుతూ చేతులెత్తేస్తున్నారు. దీంతో ఆశావాహులంతా లబోదిబోమంటున్నారు.