వినాయక నగర్ : నిజామాబాద్ ( Nizamabad) నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ తాళం వేసిన ఇంటిని టార్గెట్ చేసుకొని సోమవారం రాత్రి దొంగలు చోరీకి (Theft) పాల్పడ్డారు. కంఠేశ్వర్ బైపాస్ రోడ్డు పరిధిలో కిరాణా షాపు నిర్వహించే శేఖర్ అనే వ్యక్తి రెండు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి యాత్రలకు వెళ్లాడు.
ఇంటికి తాళం ఉండడాన్ని గమనించిన దుండగులు సోమవారం రాత్రి ఇంటి తాళం ధ్వంసం చేసి ఇంట్లోకి చొరబడి నగదు(Cash), నగలు(Jewellary) ఎత్తుకెళ్లారు. పక్కింటివారు ఇంటి గేటుకు వేసిన తాళం ధ్వంసం చేసి ఉండడాన్ని గమనించి యాత్రలకు వెళ్లిన శేఖర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు.
విషయం తెలుసుకున్న ఆయన తన బంధువులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి చూడగా ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బీరువాలో ఉన్న రెండు తులాల బంగారు నగలతో పాటు రూ.40 వేలు నగదు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. ఈ ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.