నిజామాబాద్, ఏప్రిల్ 21, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతుభరోసా పథకానికి అతీగతీ లేకుండా పోతోం ది. పెట్టుబడి సాయం అమలు అవుతోన్న తీరుపై అన్నదాతల్లో ఆగ్రహం వెలుగు చూస్తోంది. పంట ఖర్చులకు వరి నాట్ల సమయంలో అందాల్సిన సాయాన్ని వరి కోతలకు అరకొరగా ఇస్తుండటంపై మండిపడుతున్నారు. మాటలు కోటలు దాటుతుండే… చేతలు మాత్రం గడప దాటడం లేదన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఉందని అన్నదాతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసి గెలిపించిన వారే ఈ దుస్థితిని ఎదుర్కోవడంపై నిట్టూరుస్తున్నారు.
కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండే… అనుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరు గ్యారంటీలతో ప్రజల్లో ప్రచారం చేసి రెచ్చగొట్టిన రేవంత్ రెడ్డి… ఇప్పుడు వ్యవహరిస్తోన్న పద్ధతిని అడుగడుగునా తప్పు బడుతున్నారు. పాలనను గాలికి వదిలేసి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీపై బూ తులు తిడుతుండడంపైనా అన్నదాతలు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ను చీటికి మాటి కి నిందలు వేస్తూ బూతు పురాణం అందుకుంటోన్న ముఖ్యమంత్రి తీరు సరికాదంటూ దుమ్మె త్తి పోస్తున్నారు. పరిపాలన చాతకాకపోవడంతోనే అధికారిక కార్యక్రమాల్లో రాజకీయ ప్రసంగాలు చేస్తున్నాడంటూ మండిపడుతున్నారు. రైతుభరోసా పథకం అమలవుతోన్న విధానాన్ని గమనిస్తోన్న రైతులంతా నవ్వుకుంటున్నారు. నెలకోసారి ఎకరానికి మాత్రమే సాయం చేస్తూ కాలం వెళ్లదీస్తుండటం సరికాదని రైతులు అంటున్నారు.
ఎంత మందికి భరోసా…?
రైతుభరోసా తొలి విడతలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారుగా 5.69లక్షల మంది రైతులకు మార్చి 23న పెట్టుబడి సాయం దక్కింది. నిజామాబాద్ జిల్లాలో 2లక్షల 69వేల 476 మంది రైతులకు ఎకరానికి రూ.6వేలు మాత్రమే చెల్లించారు. ఇందుకోసం రూ.134.95కోట్లు నిధులు వెచ్చిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో 3లక్షల 294 మంది రైతులకు తొలి విడతలో ఎకరానికి రూ.6వేలు చొప్పున రూ.139.42కోట్లు విడుదల చేశారు. రెండో విడతలో ఎంత మంది రైతులకు సాయం అందించారన్నది వ్యవసాయ శాఖ చెప్పడం లేదు. ఎకరానికి పైగా సాగు భూములు ఉన్న వారికే మరో ఎకరానికి మాత్రమే పెట్టుబడి సాయం జమ చేశారు. 2 ఎకరాలకు పైగా గుంట భూమికి అదనంగా డబ్బులు ఇవ్వలేదు. మూడో విడతలోనే రెండు ఎకరాలకు పైగా విస్తీర్ణానికి రైతుభరోసా అందనుందని తెలుస్తోంది. కొద్ది రోజుల్లోనే యాసంగి సీజన్ ముగియనుంది. వానాకాలం మొదలవ్వనుంది.
తొలకరి చినుకులతోనే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బాన్సువాడ, బోధన్, జుక్కల్ నియోజకవర్గాల్లో అనేక మంది రైతులు సాగుకు ఏర్పాట్లు చేస్తుంటారు. ఖర్చులకు పెట్టుబడి సాయం అవసరం ఉంటుంది. యాసంగికే పూర్తి స్థాయిలో నగదు అందకపోవడంతో వానాకాలం సీజన్ పరిస్థితిపై సర్వత్రా అనుమానాలు కలుగుతున్నాయి. 15-20 రోజుల్లో రెండో విడత సాయం చేస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పగా నెల రోజులకు ఎకరానికే సాయం అందించారు. మూడో విడతకు మరో నెల రోజుల సమయాన్ని ప్రభుత్వం నిర్ధేశించింది. ఈ లెక్కన మిగిలిన భూమికి పెట్టుబడి సాయం అందడం కష్టంగానే కనిపిస్తోంది.
ఎకరానికే రెండో విడుత
పెట్టుబడి సాయం అమలుపై రేవంత్ రెడ్డి పూటకోసారి మాట మారుస్తున్నాడు. యాసంగి 2026 రైతుభరోసా తొలి విడుత అమలు సమయంలో 20 రోజుల్లోనే రెండో విడతలో 5ఎకరాల్లోపు భూమి కలిగిన వారందరికీ సాయం చేస్తామన్నారు. కానిప్పుడు రెండో విడత పేరుతో కేవలం ఎకరానికి మాత్రమే పెట్టుబడి సాయం జమ చేశారు. ఎకరానికి పైగా వ్యవసాయ భూమి కలిగిన రైతుల్లో రెండు ఎకరాల వరకే ఇప్పటి వరకు సాయం అందినట్లుగా కనిపిస్తోంది. రెండు ఎకరాలకు పైగా విస్తీర్ణం కలిగిన సాగు భూములకు రైతుభరోసా అమలు కాలేదు.
అంతటా కోతలు మొదలయ్యాయి. కల్లాల్లో భారీగా ధాన్యపు రాశులు పోగవుతున్నాయి. సమయానికి ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదు. దొడ్డు రకం ధాన్యాన్ని సేకరించేందుకు ససేమిరా అంటుండటంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. రోజుల తరబడి కల్లాల్లో వేచి చూస్తుండటం మూలంగా అకాల వానలతో ధాన్యం తడిసి నష్టం వాటిల్లుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి రైతులు భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. పంట నష్టానికి సాయం చేస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఎవ్వరూ ధైర్యం ఇవ్వడం లేదు. తడిసిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు ఆపసోపాలు పడుతున్నారు. ఆలస్యం అవుతోన్న కొద్దీ ధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులకు విక్రయించేందుకు రైతులు సొంతంగానే సిద్ధపడాల్సిన దుస్థితిని ప్రభుత్వం కల్పిస్తుండటం విడ్డూరంగా మారింది.
మాట తప్పిన రేవంత్ సర్కారు
బాన్సువాడ రూరల్, ఏప్రిల్ 21: ఎన్నికలకు ముందు రైతు భరో సా పథకం కిందఎకరాకు రూ.15వేలు ఇస్తామని చెప్పి ఓట్లు దండుకున్న సీఎం రేవంత్రెడ్డి గెలిచాక రైతులను నిండా ముంచిం డు. ఇవ్వాల్సిన రూ.12వేలు కూడా సక్కగా ఇస్తలేడు. గత సీఎం కేసీఆర్ రైతుబంధు సకాలంలో చెల్లించి రైతులను ఆదుకున్నాడు. సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన మాటలు నీటి మూటలుగానే ఉన్నాయి. కేవలం రూ.6వేలు చెల్లిస్తూ చేతులు దులుపుకుంటున్నాడు. రైతుల పాలిట దేవుడు అప్పటి సీఎం కేసీఆర్ సారే.
– సాయిలు, రైతు, బోర్లం
కేసీఆర్ సభతోనే భరోసా నిధులు విడుదల
అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీలు ఏ ఒక్కటి సక్కగా అమలు చేస్తలేదు. రైతులకు రెండో విడుత రైతు భరోసా నిధులు ఐదెకరాల వరకు ఇస్తామని చెప్పి కేవలం ఒక ఎకరానికి వేయడం సిగ్గు చేటు. అది కూడా కేసీఆర్ సభతో రైతులకు రూ.6వేల చొప్పున విడుదల చేశారు. ఇది రైతులను మోసం చేసే ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది చేతల ప్రభు త్వం కాదు, మాటల ప్రభుత్వం.
– మెక్క రమేశ్, బీర్కూర్