నిజామాబాద్ రూరల్, ఏప్రిల్ 28: హామ్లెట్ గ్రామాలుగా ఉన్న పల్లెలకు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ హోదా కల్పించడంతో అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. స్వయం పాలనలో అవార్డులు సొంతం చేసుకొని ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇందుకు నిజామాబాద్ రూరల్ మండలంలోని శ్రీనగర్ గ్రామమే నిదర్శనం. గుండారం జీపీ పరిధిలో ఉన్న శ్రీనగర్‌ను నూతన గ్రామపంచాయతీగా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి అన్ని గ్రామాల మాదిరిగానే స్వయం పాలనతోపాటు నిధులు కూడా మంజూరయ్యాయి. దీనిని గ్రామస్తులు, పాలకవర్గం సద్వినియోగం చేసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన పల్లెప్రగతి, హరితహారం తదితర కార్యక్రమాలను గ్రామంలో పకడ్బందీగా అమలు చేశారు. దీంతో గ్రామమంతా పచ్చదనం సంతరించుకున్నది. దాదాపు మట్టి రోడ్డన్నింటినీ సీసీలుగా మార్చారు. ప్రతిరోజూ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. విలేజ్ పార్కును ఏర్పాటు చేసి అందమైన మొక్కలతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. వీటితోపాటు కంపోస్ట్ షెడ్డు, వైకుంఠధామం నిర్మించారు.
వంద శాతం ఇంటిపన్ను వసూలుతోపాటు పచ్చదనం, పరిశుభ్రత, వైకుంఠధామం నిర్మాణంలో రాష్ట్రీయ గ్రామస్వరాజ్ అభియాన్ కింద జిల్లాలో 5 జీపీలు ఎంపిక కాగా, అందులో శ్రీనగర్ జీపీ ఒకటి ఉండడం విశేషం. దీంతో ప్రభుత్వం రూ.20 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతోపాటు జీపీ నుంచి మరో రూ.10 లక్షలు కలిపి మొత్తం రూ.30 లక్షలతో స్థానికుడు వీరారెడ్డి విరాళంగా అందజేసిన 120 గజాల స్థలంలో కొత్తగా గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మించారు. రూరల్ మండలంలో కొత్తగా ఏర్పడిన ఆరు గ్రామపంచాయతీల్లో సొంత భవనం నిర్మించుకున్న మొదటి జీపీగా శ్రీనగర్ నిలువడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న అన్ని కార్యక్రమాలనూ గ్రామంలో విజయవంతంగా అమలుచేస్తూ ఆదర్శంగా నిలిచారు. ఫలితంగా అనతి కాలంలోనే ఏడు అవార్డులు సొంతం చేసుకోవడం విశేషం. గ్రామాల అభివృద్ధిపై పంచాయతీల వారీగా ప్రభుత్వం అవార్డులు ప్రకటించగా, శ్రీనగర్ జీపీ జిల్లాస్థాయిలో క్లీన్ అండ్ గ్రీన్ విభాగంలో అవార్డు దక్కించుకున్నది. రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు చేతులమీదుగా ఈ అవార్డును అందజేసి సర్పంచ్ ఉడుముల సురేందర్‌రెడ్డి, కార్యదర్శి సందీప్‌ను సన్మానించారు. దీంతోపాటు మండలస్థాయిలోనూ ఆరు అవార్డులు సాధించి ఆదర్శంగా నిలిచింది. మండలస్థాయి అవార్డులను జడ్పీ సీఈవో గోవింద్, ఎంపీపీ అనూషా ప్రేమ్‌దాస్, జడ్పీటీసీ బొల్లెంక సుమలతా గోపాల్‌రెడ్డి, ఎంపీడీవో మల్లేశ్ అందజేశారు.
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కృషితో మాగ్రామానికి రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ హోదాను కల్పించింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లెప్రగతి వంటి అన్ని కార్యక్రమాలనూ విజయవంతంగా అమలు చేస్తున్నాం. ప్రజలు, పాలకవర్గ సభ్యులు పూర్తిగా సహకరించడంతోనే ఇది సాధ్యమైంది. జిల్లా, మండల స్థాయి అవార్డులు రావడం గర్వంగా ఉన్నది.ఎమ్మెల్యే సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తాం.
-ఉడుముల సురేందర్‌రెడ్డి, సర్పంచ్, శ్రీనగర్
గ్రామంలో ఏ కార్యక్రమాన్ని చేపట్టినా ప్రతి ఒక్కరూ సహకరిస్తారు. పంచాయతీ పాలకవర్గ సభ్యులు గ్రామస్తులకు అవగాహన కల్పిస్తారు. జిల్లా, మండల అధికారుల పర్యవేక్షణలో పంచాయతీ సిబ్బంది కూడా ప్రత్యేక శ్రద్ధతో పని చేస్తారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయం, సమష్టి కృషితోనే మా పంచాయతీకి ఏడు అవార్డులు వచ్చాయి.
-సందీప్, పంచాయతీ కార్యదర్శి, శ్రీనగర్