విద్యానగర్, డిసెంబర్ 26 : కామారెడ్డి పట్టణంలో జనవరి 1వ తేదీ నుంచి పాలిథిన్ వాడకాన్ని నిషేధించేందుకు మున్సిపల్ యంత్రాంగం కసరత్తును మొదలు పెట్టింది. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న పాలిథిన్ మహమ్మారిని తరిమి కొట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ తీసుకుంటున్నాయి. 75 మైక్రాన్ల కన్నా తక్కువ మందం కలిగిన పాలిథిన్ కవర్లు వాడకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చాయి. పాలిథిన్ వాడకంతో పర్యావరణానికి పెను ప్రమాదం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. పాలిథిన్ ఉత్పత్తులను నిషేధిస్తూ కామారెడ్డి మున్సిపల్ యంత్రాంగం ఇప్పటికే పట్టణంలో పలు వ్యాపార సంస్థ లు, ఫంక్షన్‌హాల్ సభ్యులతో ము న్సిపల్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి పాలిథిన్ వాడడంతో కలిగే అనర్ధాలను వారికి వివరించింది. ప్లాస్టిక్ కవర్లకు బదులు బట్టల బ్యాగులను వాడాలని అధికారులు సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హె చ్చరించారు. ఈ నెల 31వ తేదీ వరకు ప్రభుత్వం నిర్దేశించిన 120 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న పాలిథిన్ క్యారీ బ్యా గులు తయారు చేసిన వారికి రూ. 50 వేలు, అమ్మిన వారికి రూ.2,500 నుంచి 5 వేల వరకు, వాడిన వ్యక్తులకు రూ.250 నుంచి రూ.500 వరకు జరిమానా విధించనున్నారు. పాలిథిన్ చెత్తను కాల్చిన వ్యక్తులు, సంస్థలకు తీవ్రతను బట్టి రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధించనున్నారు.
నిబంధనలను అతిక్రమిస్తున్న వ్యాపార సంస్థలు..
ప్రభుత్వం పాలిథిన్‌పై చర్యలు చేపట్టినప్పటికీ పలు వ్యాపార సంస్థలు పట్టించుకోకుండా తమ లాభం కోసం పాలిథిన్ను వాడుతున్నారు. వారికి ఎన్ని సార్లు అవగాహన కల్పించినా ఎలాంటి స్పందన లేదు. యథేచ్ఛగా పాలిథిన్ కవర్లను వాడుతున్నారు. పలువురు పర్యావరణ నిపుణులు కూడా పాలిథిన్ను వాడొద్దని చెప్పినా ప్రజలు మరిచిపోలేక పోతున్నారు. చిన్న వ్యాపారుల నుంచి మొదలుకొని పెద్ద వ్యాపారుల వరకు పాలిథిన్ కవర్లను వాడుతున్నారు. పలు ప్రధాన వీధుల్లో చెత్త కన్నా పాలిథిన్ కవర్లు ఎక్కువగా కనిపించడం గమనర్హం. పాలిథిన్ వాడడంతో ప్రజల్లో తీవ్రమైన హానీ కలుగుతుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. తినే అన్నం ప్లేట్ నుంచి మొదలు కొని చేతులు కడుక్కునే గ్లాసుల వరకు పాలిథిన్నే వాడుతున్నారు.
పాలిథిన్ వాడకంతో కలిగే నష్టాలు..
పాలిథిన్ కవర్లతో కాలువలు మూసుకపోవడం, భూగర్భ జలాల కాలుష్యం, విచక్షణ రహితంగా ఉపయోగించే రసాయనాలతో పర్యావరణ సమస్యలు ఏర్పడుతాయి. పాలిథిన్ కవర్లు భూగర్భంలో కలిస్తే కొన్ని వేల సంవత్సరాలైనా అవి భూమిలోనే ఉంటాయి. దీంతో ప్రాణకోటికి తీవ్రమైన హాని కలుగుతుంది. పాలిథిన్ రహిత సమాజంగా మారాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్‌ను నిషేధించాలని తీవ్రంగా కృషి చేస్తున్నారు.
పాలిథిన్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు..
జిల్లా కేంద్రంలో పాలిథిన్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే పలువురు వ్యాపారులు, ఫంక్షన్ హాల్ యజమానులకు అవగాహన కల్పించాం. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. పాలిథిన్ రహిత కామారెడ్డిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం.
– దేవేందర్, కామారెడ్డి మున్సిపల్ కమిషనర్
పాలిథిన్ కవర్ల వాడకాన్ని నిషేధించాలి..
కేవలం ప్రకటనలతోనే కాకుండా పాలిథిన్ కవర్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలి. అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి. జరిమానాలు విధించడంతోపాటు కఠిన చర్యలు తీసుకుంటే దీనిని కట్టడి చేయవచ్చు.
-ఊశయ్య, కామారెడ్డి
బట్ట బ్యాగులను వాడాలి
పాలిథిన్ను పూర్తిగా నిషేధించి వాటికి బదులుగా బట్ట బ్యాగులను వాడాలి. దీంతో పర్యావరణాన్ని కాపాడిన వారమవుతాం. ఇది ఒక్కరితో కాదు ప్రజలందరూ కలిసి పాలిథిన్ను నిషేధించాలి.
సి.అనిల్ కుమార్, దేవునిపల్లి