నిజామాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):రైతులకు ఆత్మైస్థెర్యం కల్పించి వ్యవసాయం చేసేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా వినూత్న పథకాలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. యాంత్రీకరణకు పెద్దపీట వేసి, గోదాముల నిర్మాణం చేపట్టి వ్యవసాయరంగాన్ని లాభసాటిగా మార్చేందుకు అన్నిరకాల చర్యలు తీసుకున్నారు. దీంతో ఏడేండ్లలో తెలంగాణ వ్యవసాయరంగ ముఖచిత్రమే సంపూర్ణంగా మారిపోయింది. ఆకలి చావులతో అల్లాడిన తెలంగాణ..అన్నపూర్ణగా మారింది. తిండిగింజలకు తండ్లాడిన తెలంగాణ.. నేడు ధాన్యపు రాశులతో కళకళలాడుతున్నది. సీఎం కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలతోనే ఈ విజయం సాధ్యమైంది. వ్యవసాయమే వృత్తిగా దాదాపు 60నుంచి 70 శాతం మంది ప్రజలు ఆధారపడిన ఈరంగాన్ని బలోపేతం చేయాలన్న తలంపుతో రైతులను అనేక విధాలా సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారు. అందులో యావత్ దేశమే నివ్వెరపోయేలా రైతులకు ఆర్థికసాయం రూపంలో పెట్టుబడి ఖర్చులకు అందిస్తున్న రైతుబంధు పథకం కర్షకుల కన్నీళ్లను తుడుస్తున్నది. అప్పుల ఊబిలో కూరుకుపోకుండా కాపాడుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.50వేల కోట్ల మేర రైతుబంధుకు ప్రభుత్వం వెచ్చించింది. నిజామాబాద్ జిల్లాలో ఈ మొత్తం విలువ రూ.2వేల కోట్లుగా ఉండడం ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది.
విజయవంతంగా అమలు..
2018 వానకాలం నుంచి రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం అమలు చేస్తున్నది. మొదట ఎకరానికి రూ.4వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని రైతులకు చెక్కుల ద్వారా పంపిణీ చేశారు. 2019 వానకాలం నుంచి ఎకరానికి రూ.5వేల సాయాన్ని సీఎం కేసీఆర్ అందిస్తున్నారు. చెక్కులకు బదులుగా రైతుల ఖాతాల్లోనే నేరుగా పెట్టుబడి సాయాన్ని జమ చేస్తున్నారు. 2018, మే 10న మొదలైన రైతుబంధు పథకం ఇప్పటి వరకు ఎనిమిది విడుతలుగా విజయవంతంగా సాగుతున్నది. ఏడు విడుతల పంపిణీ ముగియగా… ఎనిమిదో విడుతలో భాగంగా యాసంగి సాగుకు రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో నాలుగు రోజులుగా జమ అవుతున్నది. 2018 వానకాలంలో 2.37లక్షల మంది రైతులకు రూ.204.24కోట్లను ప్రభుత్వం కేటాయించింది. 2019 యాసంగిలో 2.29లక్షల మందికి రూ.204.44 కోట్లు, 2019 వానకాలంలో 2.36 లక్షల మందికి రూ.258.93 కోట్లు, 2020 యాసంగిలో 2.17 లక్షల మందికి రూ.237.64 కోట్లు, 2020 వానకాలంలో 2.53 లక్షల మందికి రూ.270.7 3 కోట్లు, 2021 యాసంగిలో 2.56 లక్షల మందికి రూ.272.03 కోట్లు, 2021 వానకాలంలో 2.61 లక్షల మందికి రూ.271.68 కోట్ల మేర కేటాయింపులు జరిగాయి. సాగు కాలానికి ముందే రైతుబంధు చెల్లింపులను ప్రభుత్వం పూర్తి చేసింది. 2022 యాసంగికి 2లక్షల 67వేల 44 మందికి రైతుబంధు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.272.72 కోట్లు కేటాయించింది. ఇప్పటి వరకు ఎనిమిది విడుతల్లో రైతుల పెట్టుబడి సాయం కింద నిజామాబాద్ జిల్లా అందిన మొత్తం విలువ రూ.1992 కోట్లు కావడం విశేషం.
అత్యంత పారదర్శకత..
కాంగ్రెస్ హయాంలో ఏ పథకానికైనా అర్హులకన్నా ఎక్కువగా అనర్హులకే ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేవి. అనేకమంది రాజకీయ నాయకులే దొడ్డిదారిలో సర్కారు సొమ్మును కాజేసేవారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందివ్వడం అన్నది పారదర్శకంగా జరుగుతున్నది. ఇందుకు రైతుబంధు రూపంలో అందుతున్న రూ.వందల కోట్ల పంపిణీ ప్రక్రియనే నిదర్శనంగా నిలుస్తుంది. రైతుబంధు సాయంలో ప్రభుత్వం పారదర్శకతను పాటిస్తున్నది. భూమి కొనుగోలు, అమ్మకాల మూలంగా ఏటా ఆయా సీజన్లలో పట్టాదారుడి పేరు మారుతుంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కొత్తగా పాస్‌బుక్కులు పొందిన వారు రైతుబంధు సాయానికి ముందే దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పిస్తున్నది. అనేక మంది రైతులు వివిధ కారణాలతో తమ వారసుల పేరిట సాగు భూమిని బదలాయిస్తున్నారు. కొత్తగా పాస్‌బుక్కులు మార్పులు చేర్పులు జరిగినప్పుడు ఇబ్బందులు తలెత్తకుండా కొత్తవారిని రైతుబంధు స్కీమ్‌లో చేర్చుతున్నారు. రాష్ట్రంలో పట్టాదారు పాస్బుక్కు కలిగి ఉన్న వారందరికీ రైతుబంధు సాయం వస్తున్నది. గుంట భూమి ఉన్నప్పటికీ అందుకు తగిన విధంగా నగదు జమ అవుతున్నది. రైతుబంధు ద్వారా ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతన్నలకు భారీ ఊరట కలుగుతున్నది.
అప్పులు అవసరం లేకుండానే..
అప్పుల కోసం ఎవరి గడప తొక్కకుండానే రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. సర్కారే పెట్టుబడికి పైసలు ఇస్తుండడంతో కర్షకులంతా మిత్తి వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పోయింది. బంగారు నగలు కుదువ పెట్టి నగదు తెచ్చుకొని ఎరువులు, విత్తనాలు కొనాల్సిన అవసరం కూడా ఉండడం లేదు. వానకాలం, యాసంగి సీజన్ వస్తుందంటేనే రైతులకు ఆందోళన ఉండేది. ఇప్పుడు సమయానికి ముందే చేతికి డబ్బు రావడంతో కొండంత ధైర్యంతో కర్షకులు సాగుకు సిద్ధం అవుతున్నారు. రైతుల మేలు కోసం రైతుబంధు పథకాన్ని ఎన్ని కష్టాలు ఎదురైనా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు. 2020 యాసంగి నుంచి కరోనా రూపంలో రాష్ట్ర సర్కారుకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా… పెట్టుబడి సాయాన్ని సర్కారు నిలుపుదల చేయలేదు. రైతుబంధు అమలు చేయడంలో కనీసం జాప్యం కూడా చేయకుండానే రైతులకు నగదును అందించింది. మూడు సీజన్లలో కంటికి కనిపించని కరోనాతో రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి తగ్గింది. అయినప్పటికీ ఏదో రకంగా నిధులను సర్దుబాటు చేసుకుంటూ రైతులకు పెట్టుబడి సాయాన్ని కొనసాగిస్తుండడం గొప్ప విషయంగా రాజకీయ విశ్లేషకులు, వ్యవసాయరంగ నిపుణులు చెబుతున్నారు.
పెట్టుబడికి సాయమైతున్నయ్..
నాకు అద్దబిగెడు పొలం ఉన్నది. ఏటా పంట ఏసేమునుపు రైతుబంధు కింద 2500 రూపాలు బ్యాంకు ఖాతాల పడుతున్నయ్. మొన్నగూడ అకౌంట్ల పైసలు పడ్డయ్. నేను ఎవుసం చేయవట్టిన నుంచి ఇప్పటిదాక ఇసొంటి ముఖ్యమంత్రిని సూడలె. పంట ఏసినప్పుడల్లా అండగా ఉన్ననని మాకు పెట్టుబడికి పైసలు ఇచ్చి ఏ రంది లేకుండ జేస్తుండు. రైతుబంధు డబ్బులతోటి మాకు పంట పెట్టుబడి ఖర్సులు ఎళ్లిపోతున్నయ్. పంట అమ్మంగ వచ్చిన నాలుగు రూపాలు కండ్లకు కనిపిస్తున్నయ్. లేకపోతే ఎప్పటికీ అప్పులేనాయే. నాలుగేండ్ల సంది బాధలు పోయినయ్. ఇంతకుమునుపు ఎవుసం జేద్దమంటే భారమనిపిస్తుండె. ఇప్పుడు ఎవుసం అంటేనే పండుగైంది. తెలంగాణ సర్కారోళ్లు చెప్పినట్లుగానే ఉన్న అద్దబిగెడు భూమిల జొన్న ఇత్నాలు ఏస్తున్న. మాసొంటి రైతులకు అక్కరకచ్చే పనులెన్నో జేస్తున్న కేసీఆర్ సారు సల్లంగుండాలె.