నిజామాబాద్, ఆగస్టు 19, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో టాస్క్ఫోర్స్ విభాగం ప్రక్షాళన గాలిలో పేకమేడ మాదిరిగా మారింది. ఏడాదిన్నర కాలంగా ఇప్పటి వరకు ముగ్గురు సీపీలు మారినప్పటికీ మార్పు కానరావడం లేదు. సీపీ కల్మేశ్వర్ సింగెనవార్ ఉన్నప్పుడు ఈ విభాగం తీవ్రమైన ఆరోపణలకు గురైంది. నాటి ఏసీపీ ఇష్టారీతిన వ్యవహరించిన తీరుతో పోలీస్ శాఖ పరువు బజారున పడింది. అసాంఘిక కార్యక్రమాలను నిలువరించేలాల్సిన విభాగంలో పని చేసే పోలీసులే ఇష్టారీతిన వసూళ్లకు తెగబడటం సంచలనం రేపింది. టాస్క్ఫోర్స్ అక్రమాలపై నమస్తే తెలంగాణ దినపత్రికలో వరుస కథనాలు ప్రచురించింది. నిఘా వర్గాల ద్వారా సమాచారం సేకరించిన నాటి సీపీ నేరుగా డీజీపీకి టాస్క్ఫోర్స్ ఏసీపీపై నివేదికను సమర్పించారు. మొదట బదిలీ, ఆ తర్వాత సస్పెన్షన్ వేటు వేశారు. తదనంతరం టాస్క్ఫోర్స్ విభాగంలో సీఐ, ఎస్సైలు, కానిస్టేబుళ్లను సమూలంగా మార్చారు. ఇందులో పాతుకు పోయిన ఖాకీలను సుదూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేశారు. ప్రక్షాళన కొనసాగుతున్న సమయంలోనే కల్మేశ్వర్ బదిలీ అయ్యారు. ఇన్ఛార్జీ సీపీగా సింధూ శర్మ బాధ్యతలు తీసుకున్నారు. కామారెడ్డి ఎస్పీగా ఉంటూనే నిజామాబాద్ సీపీగా ఆమె ఎక్కువగా ఇటువైపు దృష్టి సారించకపోవడంతో టాస్క్ఫోర్స్ విభాగం పనితీరు పాతాళానికి చేరింది. నాటి నుంచి ఈ విభాగం అనుకున్నంత స్థాయిలో పని చేయకపోవడంతో కళంకంగా మారింది.
నిజామాబాద్ పోలీస్ కమిషనర్గా మార్చి 12న సాయి చైతన్య బాధ్యతలు స్వీకరించారు. ఇన్ఛార్జీ సీపీ కాలంలో గాడి తప్పిన వ్యవస్థను సక్రమ బాటలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సీఐ, ఎస్సైల పనితీరులో మెరుగుదల కోసం నిరంతరం ఠాణాలను తనిఖీలు చేపట్టారు. రికార్డుల నిర్వాహణతో పాటుగా నేరాలు, ఘోరాలపై విచారణ, పరిశోధన ప్రక్రియలో సాంకేతికత వినియోగాన్ని పెంచారు. అయినప్పటికీ క్షేత్ర స్థాయిలో జూదం, అక్రమ ఇసుక, వ్యభిచారం, గంజాయి రవాణా, ఆల్ఫాజోలం అమ్మకాలు, మొరం రవాణా అన్నది తగ్గుముఖం పట్టలేదు. చీకటి దందాగా మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్లుగా కొనసాగుతోంది. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెట్టాల్సిన టాస్క్ఫోర్స్ విభాగం సుప్తావస్థలోకి వెళ్లింది. సీపీగా సాయి చైతన్య బాధ్యతలు స్వీకరించి ఆరు నెలలు కావొస్తున్నప్పటికీ టాస్క్ఫోర్స్ విభాగం పనితీరులో మార్పు కానరావడం లేదు. స్వతంత్ర నిఘా అన్నదే టాస్క్ఫోర్స్లో మూసుకు పోయింది. సీపీ ఆదేశాలతో దాడులు నిర్వహించడం మినహాయిస్తే అసాంఘిక కార్యక్రమాలపై నిఘా పెట్టింది లేదు. దాడులు నిర్వహించిన దాఖలాలు అంతంత మాత్రమే అన్నట్లుగా కొనసాగుతోంది. ఈ దశలో టాస్క్ఫోర్స్ విభాగం తీరుపై ఆరోపణలు వస్తుండటంతో సీపీ సాయి చైతన్య తక్షణ చర్యల్లో భాగంగా ఒక సీఐ, ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, 9 మంది కానిస్టేబుళ్లను తొలగించి ఇతర ప్రాంతాలకు బదిలీ వేటు వేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. ఇందుకు సీపీ నియామకమే ఉదాహరణ. ఏకంగా ఆరు నెలల పాటు ఇన్ఛార్జి సీపీతోనే శాంతి, భధ్రతల వ్యవహారాలను నడిపించారు. పూర్తి స్థాయి సీపీ నియామకానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అర సంవత్సరం సమయం పట్టిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పోలీస్ కమిషనరేట్లో లా అండ్ ఆర్డర్లో ఏసీపీ పోస్టులకు భారీ డిమాండ్ ఏర్పడింది. రాత్రికి రాత్రి నేతల ఆదేశాలతో పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. అనుకున్న వ్యక్తులకు, అనుకూలమైన అధికారులకు పోస్టింగ్లు ఇస్తున్నారు. ప్రత్యేక విభాగాలకు అధికారుల నియామకంపై పోలీస్ శాఖ నిద్దుర పోతోంది. నిజామాబాద్ కమిషనరేట్లో టాస్క్ఫోర్స్ ఏసీపీ లేక 10 నెలలు కావొస్తుంది. ఇన్ఛార్జీ అధికారితోనే ఈ విభాగాన్ని నడిపిస్తున్నారు. ఇన్ఛార్జీ అధికారి పూర్తి స్థాయిలో పని చేయలేక చేతులు ఎత్తేస్తుండటంతో సమస్య జఠిలంగా మారి కుప్పకూలే దుస్థితి వచ్చింది. సీపీ అధికార పరిధిలో ఖాకీలను మార్చుతున్నప్పటికీ ఏసీపీ స్థాయి అధికారి కేటాయింపును డీజీపీ స్థాయిలో మాత్రమే చేపట్టాల్సి ఉంది. ఏసీపీని ఏ కారణంతో నియమించడం లేదన్నది ఇప్పటి వరకు ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. సీపీ సాయి చైతన్య టాస్క్ఫోర్స్ను ప్రక్షాళనకు పూనుకున్నప్పటికీ ప్రభుత్వం నుంచి సహకారం అందుతుందా? లేదా? అన్నది వేచి చూడాల్సి ఉంది.