ఖలీల్‌వాడి, ఏప్రిల్ 21: ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. సమస్యల పరిష్కారం కోసం కార్మిక లోకం దీర్ఘకాలిక పోరాటానికి సిద్ధమైంది. హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్‌పై పోరుకు సమాయత్తమైంది. ఈ నెల 22 నుంచి సమ్మెలోకి వెళ్లనున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. సమ్మె విజయవంతానికి సన్నాహక కార్యక్రమాలు కూడా చేపడుతున్నది. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుండా కాలయాపన చేయడంపై మండిపడుతున్నారు.
కాంగ్రెస్ ఢోకా..
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చింది. ఆర్టీసీ ఉద్యోగులపై కూడా వరాలు కురిపించింది. కానీ వాటిని అమలు చేయకుండా కాలం గడుపుతున్నదని కార్మికులు మండిపడుతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, బకాయి పడిన రెండు పీఆర్సీలను అమలు చేయడం, ప్రభుత్వం వాడుకున్న ఉద్యోగుల పీఎఫ్, సీసీఎస్ నిధులను తిరిగి చెల్లించడం తదితర డిమాండ్లు నెరవేర్చాలని కోరుతున్నారు. వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు అడుగులు పడ్డాయి. ఆర్టీసీ కార్మికులను కడుపులో పెట్టుకుని చూసిన కేసీఆర్.. వేతన పెంపు సహా అనేక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించారు. అయితే, ఎన్నికలు రావడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పరిస్థితి మొదటికొచ్చింది.
డిమాండ్ల సాధన కోసం..
విలీనంతో పాటు పీఆర్సీలు ఇస్తామని మాట ఇచ్చిన కాంగ్రెస్ అమలు చేయకుండా చేతులెత్తేసింది. హామీలు అమలు చేయాలని ఏడాదికి పైగా కార్మికులు కోరుతున్నా స్పందన లేదు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, కార్మిక సంఘాల పునరుద్ధరణ, బకాయి ఉన్న రెండు వేతన సవరణల అమలు, అంతకుముందు వేతన సవరణ బకాయిలు చెల్లింపు, ఆర్టీసీ వాడేసుకున్న ఉద్యోగుల పీఎఫ్, సీసీఎస్ నిధులు తిరిగి చెల్లింపు, ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన నడుపుతున్న ఎలక్ట్ట్రిక్ బస్సులను స్థానంలో ప్రభుత్వమే కొత్తవి కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వడం, కార్మికులపై పనిభారం తగ్గించేలా ఖాళీల భర్తీ చేయడం.. ఇలా మొత్తం 32 డిమాండ్లను ఆర్టీసీ జేఏసీ ప్రభుత్వం ముందుంచింది.
ఏడాది కాలంగా సర్కారుపై ఒత్తిడి తెస్తున్నా కనీస స్పందన లేకుండా పోయింది. దీంతో జేఏసీ గత నెల 13న సమ్మె నోటీసు ఇవ్వగా, చర్చలకు రావాల్సిందిగా కార్మికశాఖ కమిషనర్ కార్యాలయం ఆహ్వానించింది. అయితే, అసెంబ్లీ సమావేశాల కారణంగా చర్చలను అర్ధాంతరంగా రద్దు చేసింది. తిరిగి ఈనెల 8న మరోసారి చర్చలకు ఆహ్వానించింది. జేఏసీ నేతలు హాజరు కాగా, ఆర్టీసీ అధికారులు రాలేదు. ఈ నెల 13న మరోసారి చర్చలకు పిలిచినా రాలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 22 నుంచి సమ్మెలోకి వెళ్లనున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది.
డిమాండ్లు పరిష్కరించాలి..
మా సమస్యలపై ప్రభుత్వం ముందు నుంచి సానుకూలంగా లేదు. ఆర్టీసీని విలీనం చేసుకుంటామన్న హామీ అలాగే ఉండిపోయింది. పీఆర్సీ ఊసే లేదు. ఎన్నిసార్లు విన్నవించినా సమస్యలు పరిష్కారం కావడం లేదు. ప్రభుత్వం ముందు పెట్టిన 32 న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి. లేకపోతే సమ్మెకు వెళ్లడం ఖాయం. ఈ నెల 22 నుంచి సమ్మె ప్రారంభమవుతుంది. దీన్ని కార్మికుల సమ్మెగానే కాకుండా ప్రజా ఉద్యమంగా మార్చుతాం.
– వందేమాతరం శ్రీనివాస్, ఆర్టీసీ జేఏసీ జిల్లా చైర్మన్
పీఆర్సీ ఎటుపోయింది?
పీఆర్సీ అమలు చేస్తామన్న హామీని ప్రభుత్వం నెరవేర్చలేదు. బకాయి ఉన్న రెండు వేతన సవరణలు అమలు చేయాలి. ఆర్టీసీ కార్మికల సంఘాలను పునరుద్ధరించాలి. ఎలక్ట్రికల్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. కార్మికులపై పని ఒత్తిడి తగ్గించాలి. న్యాయమైన డిమాండ్లు అమలు చేయకుంటే సమ్మె తప్పదు.
– సాయిలు, జేఏసీ కో-కన్వీనర్
పీఎఫ్, సీసీఎస్ నిధులు చెల్లించాలి
ఆర్టీసీని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలి. ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాల్సిన పీఎఫ్, సీసీఎస్ నిధులను ప్రభుత్వం వాడుకున్నది. వీటిని వెంటనే చెల్లించాలి. బకాయి ఉన్న రెండు వేతన సవరణలను వెంటనే అమలు చేయాలి.
– జీపీ రామ్, జేఏసీ కో-కన్వీనర్
సమస్యలు పరిష్కరించాలి..
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తున్నది. గతంలో ఇచ్చిన అనేక హామీలు నెరవేర్చలేదు. 22 నుంచి మొదటి షిఫ్ట్నుంచి టీఎస్ ఆర్టీసీలో సమ్మె మొదలవుతుంది. ప్రభుత్వం వెంటనే కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. కార్మికులకు రావాల్సిన వేతనాలు, పీఆర్సీలు వెంటనే విడుదల చేయాలి
– శేఖర్, జేఏసీ జిల్లా కో -కన్వీనర్
పని ఒత్తిడి తగ్గించాలి..
ఆర్టీసీలో పని ఒత్తిడి తీవ్రంగా ఉంటున్నది. ఒత్తిళ్ల వల్ల కొంత మంది కార్మికులు చనిపోయారు. మహిళా సిబ్బంది కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి, పని ఒత్తిడిని తగ్గించాలి.
– సీవీ రామ్, ఆర్టీసీ జేఏసీ జిల్లా -కో కన్వీనర్