నిజామాబాద్, నవంబర్ 19, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం మరోసారి కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా పంచాయతీల్లో ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్ను విడుదల చేసింది. నేటి నుంచి(నవంబర్ 20) నుంచి ఈ నెల 23 వరకు గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరించాలని ఆదేశాలు జారీ చేసింది. 20న ఓటర్ల దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణతో పాటుగా తప్పుల సవరణ ఉంటుంది. 21వ తేదీన ఓటర్ల దరఖాస్తులు, అభ్యంతరాల పరిష్కారం చేపడతారు.
23న తుది ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రచురణ ఉంటుందని ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలో డిసెంబర్ రెండో వారంలో పంచాయతీ ఎన్నికల నిర్వాహణకు షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. వచ్చే నెలలోపు పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే వీలు కనిపిస్తోంది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజా పాలన వారోత్సవాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి.
రెండు నెలల్లో రెండోసారి..
తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్వాకంతో రెండు నెలల్లో రెండోసారి ఓటరు జాబితా సవరణ జరుగనుంది. సెప్టెంబర్ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహణకు గతంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇందులో భాగంగా కోర్టు ఆదేశాల్లో భాగంగా ఆగస్టు నెలలో ఓటరు జాబితా సవరణ, తుది జాబితా ప్రచురణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఆ తర్వాత ఎన్నికలకు నోటిఫికేషన్లు జారీ కాగా నామినేషన్ల ఘట్టం కూడా ప్రారంభమైంది.
కానీ బీసీ రిజర్వేషన్ల అంశం ఏకంగా కోర్టు మెట్లు ఎక్కడంతో సందిగ్ధత ఏర్పడింది. తదనంతరం రిజర్వేషన్ల అమలుకు విడుదల చేసిన జీవో నెంబర్ 29ని రద్దు చేస్తూ కీలక తీర్పు వెలువరించడంతో ఎన్నికల ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది. ఫలితంగా డిసెంబర్లో ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధపడటంతో మరోసారి ఎన్నికల సవరణ అనివార్యమైంది. రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల మూలంగా ప్రభుత్వ యంత్రాంగంపై అనవసరమైన భారం పడుతోంది. పని ఒత్తిడితో పాటుగా విలువైన సమయం కూడా వృథా అవుతోందంటూ సర్కారు తీరుపై ఉద్యోగ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.
మరోసారి సందడి…
బీసీ రిజర్వేషన్ల అమలుపై కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని చాటుకోవడంలో అడుగడుగునా విఫలం అవుతోంది. అమలుకు నోచుకోని జీవోలు ఇచ్చి బీసీ ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టిస్తోంది. దీంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు జాప్యం జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాల్లో పాలన కుంటుపడుతోంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సైతం నిలిచి పోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో అనివార్యంగా ఈసారి మొదటగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. పార్టీ గుర్తుపై జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ప్రభుత్వం ఇప్పట్లో నిర్వహించడం కష్టంగానే కనిపిస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం మరోమారు ఓటరు జాబితాకు షెడ్యూల్ విడుదల చేయడంతో ఆశావహుల్లో సందడి వాతావరణం ఏర్పడింది. పోటీకి సమాయత్తం అయ్యేందుకు పావులు కదుపుతున్నారు.