నందిపేట్, ఏప్రిల్ 13 : ఆరు గాలం కష్టపడి పండించిన పంట అమ్ముకునేందుకు నానా అవస్థలు పడుతున్న అన్నదాతలను అక్రమార్కులు అడుగడుగునా మోసాలకు గురిచేస్తున్నారు. పూర్తిస్థాయిలో పంట విక్రయించినా రైతులకు నష్టాలు తప్పడంలేదు. కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు ఎఫ్‌సీఐకి వరి ధాన్యం విక్రయించిన తర్వాత ధాన్యం బస్తాలను రైస్ మిల్లులకు తరలించడంలో కొత్త తరహా దోపిడీకి పాల్పడుతున్నారు.
మార్గమధ్యంలో లారీల నుంచి కొన్ని ధాన్యం బస్తాలను తస్కరిస్తూ రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. మండలంలోని చింరాజ్‌పల్లి కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం బస్తాలతో ఓ లారీ ఆదివారం డొంకేశ్వర్ మండలం నూత్‌పల్లిలోని రైస్‌మిల్‌కు బయల్దేరింది. మార్గమధ్యంలో నందిపేట్ వద్ద బైపాస్ రోడ్డు మండల కార్యాలయాల సముదాయం వెనుక రోడ్డుపై లారీని నిలిపివేశారు.
లారీ నుంచి ఐదు ధాన్యం బస్తాలను పక్కన నిలిపి ఉంచిన టాటా మ్యాజిక్ వాహనంలోకి డంప్ చేస్తుండగా, గమనించిన కొందరు వీడియో తీసి డ్రైవర్‌ను నిలదీశారు. ఆ వీడియో వైరల్ కావడంతో ఈ విషయం బయటికి వచ్చింది. దీంతో సొసైటీ సిబ్బంది, రైతులు ఆరా తీసి లారీని పట్టుకొని డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు.
సాయంత్రం ఆయా గ్రామాల రైతులకు చింరాజ్‌పల్లి సొసైటీ కార్యాలయం వద్దకు చేరుకుని సిబ్బందిని నిలదీశారు. ఈ మేరకు రైతులు సహకార సంఘ అధికారులతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.సాధారణంగా తరుగు పేరిట 5 నుంచి 10 క్వింటాళ్ల వరకు ఒక లారీకి తీసివేస్తూ వస్తున్నారు. ఎండలు తీవ్రంగా ఉండడంతో బరువు తగ్గి తరుగు వస్తుందేమోనని రైతులు భావిస్తుంటారు. కానీ ఇలా చోరీకి పాల్పడి రైతులను నిలువునా ముంచేస్తున్నారు.