కంఠేశ్వర్, ఫిబ్రవరి 23: ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్ అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు సూచించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఎన్నికల సెక్టోరల్ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వ హించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒకరిద్దరు మినహాయిస్తే సెక్టోరల్ అధికారులందరూ సమర్థవంతంగా విధులు నిర్వర్తించారన్నారు. అదే స్ఫూర్తితో పార్లమెం ట్ ఎన్నికల్లో మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని, ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని హితవు పలికారు. విధులను ఏమాత్రం తేలికగా తీసుకోవద్దని, ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
విధుల పట్ల అలసత్వాన్ని ప్రదర్శిస్తూ నిర్లక్ష్యానికి తావిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సీపీ కల్మేశ్వర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేలా నగదు, మద్యం, మత్తు పదార్థాలు, ఇతర సామగ్రిని పంపిణీ చేసే అవకాశాలు ఉన్నందున కట్టుదిట్టమైన నిఘా ఉంచాలన్నారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేలా పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేపడుతామన్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాల వద్ద సాయుధ బలగాలను మోహరిస్తామన్నారు. జిల్లా ఉప ఎన్నికల అధికారిణి కృష్ణవేణి, ఆర్మూర్ ఆర్డీవో వినోద్‌కుమార్, ఏఆర్ఈవోలు, సెక్టోరల్ అధికారులు పాల్గొన్నారు.