ఎల్లారెడ్డి/కామారెడ్డి, జనవరి 31: మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. నామినేషన్ వేసిన వివిధ పార్టీలకు చెందిన నాయకుల్లో బీఫామ్ టెన్షన్ పట్టుకున్నది. అన్ని పార్టీల నుంచి ఒక్కో వార్డుకు నలుగురు నుంచి ఐదుగురు, కొన్నిచోట్ల ఏడుగురు నామినేషన్లు వేశారు. ఇప్పటి వరకూ ఏ పార్టీ కూడా అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించలేదు. చాలా ప్రాంతాల్లో పోటీల్లో ఎక్కువ మంది ఉండడంతో అభ్యర్థులను ఖరారు చేయకుండా, నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసేవరకు వేచిచూశాయి.
అభ్యర్థుల పేర్లను ముందే ప్రకటిస్తే, టికెట్ రాని వారు మిగతా పార్టీల వైపు చూసి పోటీకి దిగుతారన్న ఉద్దేశంతో వేచిచూసే ధోరణి అవలంబించాయి. కొన్ని పార్టీల్లో సూచనప్రాయంగా అభ్యర్థులకు తెలిపినట్లు సమాచారం. కామారెడ్డి, ఎల్లారెడ్డిలో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. అధికార కాంగ్రెస్‌పార్టీతోపాటు బీజేపీ సైతం తమ అభ్యర్థులకు బీఫామ్‌లు ఇవ్వకపోవడంతో నామినేషన్ వేసిన అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో కొందరు ఇతర పార్టీల వైపు చూస్తున్నట్లు సమాచారం.
బీఫామ్‌లతో పార్టీల గేమ్
నామినేషన్ల చివరి రోజున తమ పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులకు బీఫామ్‌లు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఆయా పార్టీలు గేమ్ ప్లే చేస్తున్నాయి. బలమైన అభ్యర్థులతో పాటు ఇతరులు సైతం తమ పార్టీని వీడకుండా ఉండేందుకు బీఫామ్‌లను ఉపసంహరణ సమయంలోనే ఇవ్వాలని భావిస్తున్నాయి. నామినేషన్ల ఉప సంహరణ ఫిబ్రవరి 3న ఉండడంతో ఆ రోజు వరకు బీఫామ్ ఇవ్వడానికి అవకాశం ఉన్నది. దీంతో అన్ని పార్టీలు ఫిబ్రవరి 3న మాత్రమే తమ అభ్యర్థులకు బీఫామ్‌లు ఇవ్వడం ద్వారా జంప్ జిలానీలకు అడ్డుకట్ట వేయవచ్చని అనుకుంటున్నాయి.
ఈసారి ఉపసంహరణలు ఎక్కువే!
ఎక్కువ మంది నామినేషన్లు వేసినప్పటికీ వారిలో చాలా మంది ఉపసంహరించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు టికెట్ ఆశించి నామినేషన్ వేశారు. పార్టీలు బీఫామ్ ఇవ్వకపోతే బరిలోనిలిచేది లేదని కొందరు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలో కనీసం 15 నుంచి 20 మంది వరకు ఉపసంహరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బీఫాం ఇవ్వకపోతే రెబెల్‌గా..
కామారెడ్డిలో కొందరు ఎన్నికల సమయం రాకముందే ప్రచారం చేపట్టి, పోటీల్లో ఉంటున్నట్లు ప్రకటించుకున్నారు. రిజర్వేషన్ ఖరారు కావడం, వారి అంచనాలు తారుమారు కావడంతో కొందరు నిరాశ చెందారు. నామినేషన్ ప్రక్రియ పూర్తికావడంతో తమకు బీఫామ్ దక్కుతుందా లేదంటే రెబల్‌గా అయినా పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు. కొన్ని పార్టీల్లో గ్రూప్ రాజకీయాలు ఉండడంతో తమ వారికి బీఫామ్ దక్కుతుందా లేదా అని టెన్షన్ పడుతున్నారు. అధికార పార్టీ తరఫున పోటీ చేసేవారు ఎక్కువ మంది ఉండడంతో ఎవరిని సముదాయించాలో, ఎవరికి బీ ఫామ్ ఇవ్వాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. పోటీల్లో ఎక్కువగా స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉండకుండా బుజ్జగిస్తున్నారు.
బీఫామ్ రాకున్నా ప్రచారం…
కామారెడ్డి పట్టణంలోని 49వార్డుల్లో నామినేషన్ వేయకముందు నుంచే ఆశావహులు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. బీఫామ్ రాకున్నా ప్రచారం చేస్తుండడం గమనార్హం. గతంలో ఇంటింటికీ వెళ్లి ఓట్లను అభ్యర్థించిన అభ్యర్థులు రెండు రోజులకోసారి మళ్లీ వెళ్లి ప్రసన్నం చేసుకుంటున్నారు. రిజర్వేషన్ల కారణంగా వారు నిలబడే వార్డు కాకుండా ఇతర వార్డుల్లో కూడా నామినేషన్ వేసి నిలబడుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి బహుమతులు అందజేస్తున్నారు.