ఎల్లారెడ్డి రూరల్, డిసెంబర్ 2: రెండో విడుత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం మంగళవారం ముగిసింది. గత రెండ్రోజుల్లో అంతంగానే నామినేషన్లు రాగా, చివరి రోజున భారీగా దాఖలయ్యాయి. అభ్యర్థులు పోటెత్తడంతో ఆయా కేంద్రాలు కిటకిటలాడాయి. పలుచోట్ల సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత కూడా చాలా మంది క్యూలో ఉండడంతో వారికి టోకెన్లు ఇచ్చిన అధికారులు రాత్రి వరకు నామినేషన్లు స్వీకరించారు. రెండో విడుతకు సంబంధించి కామారెడ్డి జిల్లాలో 197 సర్పంచ్, 1654 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. అలాగే, నిజామాబాద్ జిల్లాలో 196 సర్పంచ్, 1760 వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరించారు. మంగళవారంతో గడువు ముగియగా, రెండు జిల్లాల్లో చివరి రోజు అభ్యర్థులు భారీగా నామినేషన్లు వేశారు.
భారీగా నామినేషన్లు..
కామారెడ్డి జిల్లాలోని 7 మండలాల్లో రెండో విడుత ఎన్నికలు జరుగనుండగా, భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు కొన్ని మినహా చాలా చోట్ల పోటాపోటీగా నామినేషన్లు వేశారు. లింగంపేట మండలంలో పొద్దుపోయే వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. చివరి రోజు సర్పంచ్ స్థానాలకు 114, వార్డు స్థానాలకు 456 నామినేషన్లు వచ్చాయి. అలాగే, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, నిజాంసాగర్, గాం ధారి తదితర మండలాల్లోనూ భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. కొన్ని గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవ పరిస్థితి కనిపించినా, చివరి నిమిషంలో నామినేషన్లు దాఖలు కావడంతో ఎన్నికలు అనివార్యమయ్యా యి. పొద్దుపోయే వరకు స్వీకరణ ప్రక్రియ కొనసాగడంతో నామినేషన్ల కేంద్రాల వద్ద కోలాహలం నెలకొంది.

పలుచోట్ల ఏకగ్రీవాలు..
పలు పంచాయతీల్లో ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. సర్పంచ్, వార్డు స్థానాలకు సింగిల్ నామినేషన్లు దాఖలయ్యాయి. అజామాబాద్, తిమ్మారెడ్డితండా, హాజిపూర్ తండా, సోమిర్యాగడితండా, తిమ్మాపూర్ సర్పంచ్ స్థానాలతో పాటు ఆయా గ్రామాల్లో 8 వార్డుల చొప్పున వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
నేటి నుంచి మూడో విడుతకు..
ఇక, చివరి విడుత ఎన్నికలకు సంబంధించి బుధవా రం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. నిజామాబాద్ జిల్లాలోని 165 సర్పంచ్, 1620 వార్డు లు, కామారెడ్డి జిల్లాలోని 168 సర్పంచ్, 1482 వార్డు స్థానాలకు ఈ నెల 17న ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి నామినేషన్లు పర్వం ప్రారంభం కానుంది.