మాచారెడ్డి/ బీబీపేట/భిక్కనూరు, డిసెంబర్ 16 : పెద్దపులి సంచారం పల్లెలను వణికిస్తున్నది. మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్, ఫరీద్పేట, దోమకొండ మండలంలోని అంబారిపేట, సంగమేశ్వర్, భిక్కనూర్ మండలంలోని పెద్దమల్లారెడ్డిలో పెద్దపులి అలజడి సృష్టించింది. మంగళవారం వేకువ జామున భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి శివారులో ఆవు, సంగమేశ్వర్లో దూడ, అంబారిపేటలో ఓ లేగదూడపై దాడిచేసి చంపింది.
ఘటనా ప్రాంతాలను పరిశీలించిన అటవీశాఖాధికారులు
అంబారిపేట, సంగమేశ్వర్, పెద్దమల్లారెడ్డి, చుక్కాపూర్ అటవీ ప్రాంతాలను కామారెడ్డి డీఎఫ్వో నిఖిత, ఎఫ్డీవో రామకృష్ణ , ఇన్చార్జి ఎఫ్ఆర్వో రమేశ్ మంగళవారం పరిశీలించారు. పెద్దపులి పాదముద్రలు, ట్రాప్కెమెరాల్లో చిక్కిన దృశ్యాలను ఆధారంగా చేసుకొని, ఎటువైపు నుంచి వచ్చిందో అదే దారిలో పెద్దమల్లారెడ్డి, సంగమేశ్వర్, అంబారిపేట, ఫరీద్పేట, చుక్కాపూర్ మీదుగా నిజామాబాద్ జిల్లాలోని సిర్నాపల్లి అడవులకు వెళ్లినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. మళ్లీ వచ్చే అవకా శం ఉన్నదా అనే విషయంపై కచ్చితంగా చెప్పలేమని అ ధికారులు తెలిపారు.పులిదాడిలో మృతిచెందిన పశువు ల యజమానులకు పరిహారం అందజేస్తామన్నారు.
ట్రాప్ కెమెరాలో పెద్దపులి కదలికలు
రెండు రోజుల నుంచి పెద్దపులి దాడి జిల్లాలో కలకలం రేపుతున్నది. అంబారిపేట, సంగమేశ్వర్, పెద్దమల్లారెడ్డి అటవీ ప్రాంతంలో పెద్దపులి కదలికలను గుర్తించడానికి దాడి చేసిన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో పెద్దపులి చిత్రాలు రికార్డయినట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.
రైతులు అప్రమత్తంగా ఉండాలి రమేశ్, మాచారెడ్డి రేంజ్ ఇన్చార్జి ఎఫ్ఆర్వో
అటవీ ప్రాంతంలో పశువులను ఎట్టిపరిస్థితుల్లో కట్టేయ్యవద్దు. అడవిలో పెద్దపులికి ఆహారం లభించకపోతే అది ఏ దారి గుండా వచ్చిందో అదే దారిలో వెళ్తుంది. అటవీ ప్రాంతం వైపు పొలాలు ఉండే రైతులు ఒంటరిగా వెళ్లవద్దు . పశువులను ఇంటి ఆవరణలోనే కట్టేసుకోవాలి. సాయంత్రం 5 గంటల అనంతరం ఎవరూ కూడా పొలాల వద్దకు వెళ్లరాదు