నవీపేట/వినాయక్‌నగర్, నవంబర్ 6: వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పెళ్లీడుకొచ్చిన కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఫైనాన్షియర్ల ఆగడాలు తట్టుకోలేక బాసర గోదావరిలో దూకేసింది. తండ్రి మృతి చెందగా, కూతురు గల్లంతయింది. తల్లిని జాలర్లు కాపాడారు. బాసర పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూర్ మండలానికి చెందిన వేణు (60)కు భార్య అనురాధ, కూతురు పూర్ణిమ (25) ఉన్నారు. 15 ఏండ్ల క్రితం నిజామాబాద్‌కు వలస వచ్చిన వేణు.. న్యాల్కల్ రోడ్డులో ఇల్లు అద్దెకు తీసుకొని పాన్‌డబ్బా పెట్టుకుని కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు.
వ్యాపార అభివృద్ధి కోసం గంజ్ మార్కెట్లో ఉండే వడ్డీ వ్యాపారులు రోషన్, వికాస్ వద్ద అప్పుగా రూ.3 లక్షలు తీసుకున్నాడు. అయితే, తిరిగి చెల్లించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో వడ్డీ వ్యాపారులు వేణుపై డబ్బు కోసం ఒత్తిడి తెచ్చారు. ఇటీవల ఇంటికి వచ్చి భార్య, కూతురుతో దుర్భాషలాడారు. వడ్డీ చెల్లించకపోతే నీ కూతుర్ని వివస్త్రను చేస్తామని హెచ్చరించారు. వారి వేధింపులు, అవమానాలు తట్టుకోలేని వేణు కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం తమ స్కూటీపై బాసర గోదావరి వద్దకు వెళ్లారు. అందరూ చూస్తుండగానే నదిలోకి దూకేశారు. అక్కడున్న వారు గమనించి అనురాధను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అయితే, ప్రవాహానికి వేణు, పూర్ణిమ గల్లంతయ్యారు. సమాచారమందుకున్న బాసర పోలీసులు గోదావరి వద్దకు వచ్చి జాలర్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వేణు మృతదేహం లభించగా.. పూర్ణిమ జాడ దొరకలేదు. అనురాధతో మాట్లాడిన పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకుని, కేసు నమోదు చేశారు.