బోధన్, మే 10: ఇసుక తవ్వకాలతో మంజీర నది తల్లడిల్లుతున్నది. ఇసుక మాఫియా రెచ్చిపోతుండడంతో విలవిల్లాడుతున్నది. విచ్చలవిడి తవ్వకాలతో పరీవాహక ప్రాంతంలో క‘న్నీటి’ గోస ఉత్పన్నమవుతున్నది. నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో ఉన్న పొతంగల్ మండలంలో ఇసుక మాఫియా పెట్రేగిపోతున్నది. ఈ మండలంలో కొనసాగుతున్న నాలుగు ఇసుక క్వారీల కారణంగా తీర ప్రాంత గ్రామాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.
భూగర్భ జలాలు అడుగంటి పోయి తాగు, సాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఇసుక తవ్వకాలు నిలిపి వేయాలంటూ తరుచూ ఆందోళనకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి పొతంగల్, కొడిచెర్ల క్వారీల్లో, శనివారం నుంచి హంగర్గాలో ఇసుక తవ్వకాలు తాత్కాలికంగా ఆగిపోయాయి. కారేగాం క్వారీలో మాత్రం యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఈ నాలుగు క్వారీలను టీజీఎండీసీ ఏర్పాటు చేసింది. పేరుకు ఇవి టీజీఎండీసీ క్వారీలు అయినా, ప్రైవేట్ వ్యక్తులే వీటిని నడిపిస్తున్నారన్నది బహిరంగ రహస్యం. పలుకుబడి కలిగిన వ్యక్తుల ‘హస్తం’ వీటి నిర్వహణలో బలంగా ఉంది.
నదీగర్భంలోకి చొచ్చుకుపోయి..
వాస్తవానికి నిన్నటివరకు పొతంగల్ మండలంలోని నాలుగు క్వారీల్లో నిబంధనలు పట్టించుకోకుండా ఇసుకను తవ్వేస్తున్నారన్న ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఒకపక్క కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ, ఇక్కడి క్షేత్రస్థాయి అధికార యంత్రాంగం మాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇసుక మోతాదు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంత లోతు వరకు ఇసుక తవ్వాలన్న దానిపై కొన్ని నిబంధనలు ఉన్నాయి. కానీ, వాటిని ఉల్లంఘిస్తూ కొనసాగుతున్న తవ్వకాలతో మంజీర తీర ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మంజీర నదీ గర్భంలోకి చొచ్చుకుపోయి ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. నిర్దేశిత లోతుకంటే ఎక్కువ లోతులో ఇసుక తీస్తున్నారు. ఇసుక వాహనాలు వెళ్లేందుకు నదిలో పెద్దపెద్ద ర్యాంప్‌లను నిర్మించారు. ఇసుక ర్యాంప్‌లు, లోతైన తవ్వకాలతో నదీ స్వరూపమే మారిపోతున్నది. వందలాది భారీ వాహనాలతో ఇసుక రవాణాపై నియంత్రణ ఉండడం లేదన్న ఫిర్యాదులను అధికారులు పట్టించుకోవడం లేదు.
అడుగంటుతున్న భూగర్భ జలాలు..
ఇసుక క్వారీలు స్థానిక రైతులు, ప్రజల పాలిట శాపంగా మారాయి. నదిలో లోతుగా తవ్వడం వల్ల మంజీరా తీరంలో నీటి మట్టాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఇప్పటికే అనేక చోట్ల భూగర్భ జలాలు పడిపోయాయని రైతులు వాపోతున్నారు. ఈసారి వర్షాలు ఆలస్యంగా వస్తే.. పంటల సాగుకు ఇబ్బందులు తప్పవని ఆందోళన చెందుతున్నారు. ఇసుక తవ్వకాలతో పాటు వాహనాల వల్ల పైప్లైన్లు ధ్వంసమవుతున్నాయని చెబుతున్నారు. మంజీరలో ప్రస్తుతం జరుగుతున్న ఇసుక తవ్వకాలకు సమీపంలోనే కారేగాం, హంగర్గా, సుంకిని ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. ఇప్పుడు నదిలో ఇసుక మాఫియా చర్యలతో ఎత్తిపోతల పథకాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది.
ధ్వంసమవుతున్న రోడ్లు..
ఒకే మండలం నుంచి రోజూ వందలాది భారీ వాహనాలతో ఇసుక రవాణా జరుగుతుండడంతో పొతంగల్, కోటగిరి మండలాల్లో రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన రహదారులు ధ్వంసమవుతున్నాయి. రోజూ రణగొణధ్వనులతో సాగే ఇసుక లారీల వల్ల ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. అతి వేగంతో వెళ్లే టిప్పర్లు, లారీల వల్ల రోడ్డుపైకి రావాలంటేనే భయపడుతున్నారు. ఒక చిన్న మండలంలో పక్కపక్కనే నాలుగు ఇసుక క్వారీలు ఏకకాలంలో నిర్వహించడం వల్లే అనేక సమస్యలు ఏర్పడుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామస్తుల నిరసనలతో నిలిపివేత..
పొతంగల్, కొడిచెర్ల, హంగర్గా క్వారీల్లో ఇప్పటివరకు పెద్ద ఎత్తున ఇసుక తవ్వకాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఆ మూడు గ్రామాల ప్రజలు క్వారీలకు వ్యతిరేకంగా నిరసనలకు దిగారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. దీంతో ఈ మూడు క్వారీల్లో ఇసుక తవ్వకాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని బుధవారం కారేగాం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఇసుక తవ్వకాల వల్ల తాగు, సాగునీటికి ప్రమాదం ఏర్పడుతున్నదని గ్రామస్తులు ఇసుక వాహనాలను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో మూడు క్వారీల్లో తాత్కాలికంగా తవ్వకాలు ఆగిపోయాయి. అయితే, ఇది శాశ్వతమా.. లేక మళ్లీ ప్రారంభిస్తారా? అన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కారేగాం డీఫ్లోరైడ్ స్కీమ్‌కు ముప్పు
గ్రామాల్లోని రక్షిత నీటి పథకాలకు మంజీరా నది నుంచే జలాలు వస్తుంటాయి. ఇక, కారేగాం వద్ద మంజీరపై డీఫ్లోరైడ్ స్కీమ్ ఉంది. దీని ద్వారా 19 గ్రామాలకు తాగునీటి సరఫరా చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఇసుక తవ్వకాలతో మంజీరా నదిలో నీరు వట్టిపోయే ప్రమాదం లేకపోలేదు. పైగా, నదిలో నీటి ప్రవాహాల దిశ మారవచ్చని కూడా అంటున్నారు. దీంతో కారేగాం డీఫ్లోరైడ్ స్కీమ్ ప్రమాదంలో పడే ప్రమాదం ఉంది. పెద్ద తాగునీటి పథకం వద్దనే ఇసుక క్వారీకి ఎలా అనుమతి ఇచ్చారన్న ప్రశ్న ఉత్పన్నమవుతున్నది.
ఇసుక తవ్వకాల వల్ల రైతులకు నష్టం
పొతంగల్ శివారులోని మంజీరా నదిలో ఇసుక తవ్వకాల వల్ల రైతులకు ఎంతో నష్టం జరుగుతున్నది. మంజీర శివారులో మాకు 10 ఎకరాల భూమి ఉంది. ఇప్పటికే సాగు నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఇక, ఇసుక రవాణా ఇలాగే జరిగితే సమస్య మరింత తీవ్రమవుతుంది. ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపి వేసి, రైతులను ఆదుకోవాలి
– మర్కెల్ సతీశ్‌కుమార్, రైతు, పొతంగల్
రైతులకు తీరని నష్టం..
ఇసుక క్వారీల వల్ల రైతులకు చాలా నష్టం జరుగుతున్నది. కారేగాం మంజీ ర నది సమీపంలో ఎత్తిపోతల కింద వ్యవసాయం ఉంది. కొందరు వ్యాపారులు ఇక్కడి నుంచి ఇసుకను తరలిస్తున్నారు. కానీ ఇక్కడి రైతుల పరిస్థితి ఏమవుతుందని ఒక్కరూ ఆలోచిస్తలేరు. ఉన్నతాధికారులు స్పందించి ఇసుక తవ్వకాలను నిలిపి వేయాలి.
– యోగేశ్, రైతు, కారేగాం