ఎల్లారెడ్డి రూరల్, ఫిబ్రవరి 12: ఆగి ఉన్న ఆటోను ఓ లారీ ఢీకొట్టిన ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఎస్సై గణేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. జప్తి జానకంపల్లి గ్రామానికి చెందిన నాయికోటి సాయిలు ఆదివారం ఉదయం అదే గ్రామానికి చెందిన ప్రయాణికులను తన ఆటోలో ఎక్కించుకున్నాడు. ఎల్లారెడ్డి పెద్ద చెరువు కట్టపై ఉన్న మైసమ్మ గుడి వద్ద మరో ఇద్దరు ప్రయాణికుల కోసం ఆటోను ఆపాడు.
అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ అదుపు తప్పి ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో నాలుగైదు పల్టీలు కొట్టి కట్టకిందకు పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌తోపాటు పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించగా.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని లారీ డ్రైవర్, క్లీనర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
కారు ఢీకొన్న ఘటనలో ఒకరు..
మండలంలోని కళ్యాణి ప్రాజెక్టు వద్ద బైకును కారు ఢీకొన్న ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. బాన్సువాడ నుంచి ఎల్లారెడ్డికి హమీద్ బైక్‌పై వస్తున్నాడు. ఈ క్రమంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హమీద్ కాలు విరిగింది. తీవ్రంగా గాయపడిన అతడికి ఎల్లారెడ్డి ప్రభుత్వ దవాఖానలో చికిత్స నిర్వహించి, మెరుగైన వైద్యం కోసం కామారెడ్డికి తరలించారు.