గంగాధర, నవంబర్ 7: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దళారులు రాజ్యమేలుతున్నారు. అక్కడే యథేచ్ఛగా ధాన్యం తూకం వేసి తరలిస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తుండడంతో దళారులు ఆడింది ఆట పాడింది పాటగా సాగుతోంది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ఇప్పటికే వరి కోతలు ప్రారంభం కాగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వెల్లువెత్తుతోంది. కేంద్రాలను ప్రారంభించినా, కొనుగోళ్లు చేయడం లేదు. అకాల వర్షాల కురిసే ప్రమాదం ఉన్నందున ధాన్యం తడిసిపోతే అసలుకే మోసం వస్తుందని రైతులు ఆందోళన చెందుతూ తక్కువ ధరకైనా సరే ధాన్యాన్ని అమ్ముకోవడానికి దళారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రైవేటు వ్యాపారులు క్వింటాల్‌కు రూ.1750 చొప్పున చెల్లించి కొనుగోళు కేంద్రాలు, కల్లాల వద్దే యథేచ్ఛగా తూకం వేస్తున్నారు. శుక్రవారం కురిక్యాల సొసైటీ ముందే ప్రైవేటు వ్యాపారి ధాన్యం కొనుగోలు చేసి, యథేచ్ఛగా తరలించాడు. కొనుగోళ్లు ఆలస్యం కావడంతో దళారులకు అమ్ముకుంటున్నట్లు, క్వింటాల్‌కు రూ.500 వరకు నష్టపోతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.