బాన్సువాడ రూరల్, మార్చి 21: ఉమ్మడి జిల్లాలో ‘ఉపాధి హామీ’ లక్ష్యం నీరుగారుతున్నది. ఉపాధి హామీ పథకం నిర్వహణలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, కిందిస్థాయి అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం మరో పదిరోజుల్లో ముగియనుండగా, ఉపాధి హామీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. జాబ్‌కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి వంద రోజులు పని దినాలు కల్పించాల్సి ఉండగా, ఇప్పటి వరకు కామారెడ్డి జిల్లాలో ఒక్కో కుటుంబానికి ఏడాదికి సరాసరి 35 రోజులు, నిజామాబాద్ జిల్లాలో 39 రోజుల చొప్పున పని దినాలు కల్పించడం గమనార్హం. కామారెడ్డి జిల్లాలో 22 మండలాలు (527 పంచాయతీలు) ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 2.50లక్షల జాబ్‌కార్డులు ఉండగా, 4.8లక్షల మంది కూలీలు జాబ్‌కార్డుల్లో రిజిస్టర్ చేసుకున్నారు. జాబ్‌కార్డులు కలిగిన కుటుంబాల్లో 1.78లక్షల కుటుంబాలు (2.91లక్షల మంది కూలీలు) పనులకు వస్తున్నాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కేవలం 1,280 కుటుంబాలకు మాత్రమే వంద రోజులు కల్పించారు. ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.130 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు దాదాపు రూ.100 కోట్లు మాత్రమే వెచ్చించారు. ఇందులో కూలీలకు వేతనాలు రూ. 77 కోట్లు, మెటిరీయల్ కాంపోనెంట్ కింద దాదాపు రూ.30 కోట్లు చెల్లించారు.
నిజామాబాద్ జిల్లాలో 27 మండలాలు (530 గ్రామ పంచాయతీలు) ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 2.56లక్షల జాబ్‌కార్డులు ఉండగా, 4.81లక్షల మంది కూలీలు జాబ్‌కార్డుల్లో రిజిస్టర్ అయి ఉన్నారు. 1.70లక్షల జాబ్‌కార్డు కలిగిన కుటుంబాలు (2.62 లక్షల మంది) మాత్రమే ఉపాధిహామీ పనులు చేస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కేవలం 579 కుటుంబాలకు మాత్రమే వంద రోజులు ఉపాధి కల్పించారు. ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.170 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు దాదాపు రూ.130 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యాయి. ఉపాధిహామీ పనులు నత్తనడకన సాగడంతో మెటిరీయల్ కాంపోనెంట్ కింద వచ్చే నిధులు తగ్గిపోనున్నాయి. మార్చిలో కూలీల సంఖ్య భారీగా పెరగాల్సి ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ కుటుంబాలు వంద రోజులు పూర్తి చేసుకున్నాయి. గతేడాది మార్చి నాటికి నిజామాబాద్ జిల్లాలో 5వేల కుటుంబాలు, కామారెడ్డి జిల్లాలో 2,070 కుటుంబాలు వంద రోజులు పూర్తి చేసుకున్నాయి. ఉన్నతాధికారులు చొరవ తీసుకొని కూలీల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఉపాధిహామీ కూలీలు కోరుతున్నారు.