కంఠేశ్వర్/ కామారెడ్డి, ఆగస్టు 29: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి సూచించారు. ఎలాంటి తప్పిదాలకు తావివ్వరాదని పేర్కొన్నారు. గురువారం ఆయన హైదరాబాద్ నుంచి వీసీ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, డీపీవోలు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వచ్చే నాలుగైదు నెలల వ్యవధిలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిచేయనున్నట్లు తెలిపారు. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ముందు పంచాయతీ, తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ, చివరగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని వివరించారు. జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లు ఏర్పాట్లను నిశితంగా పర్యవేక్షించాలని సూచించారు.
సెప్టెంబర్ 6న ఓటరు జాబితా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వెలువరించి అభ్యంతరాలు స్వీకరించాలని, 21న తుది ఓటరు జాబితాలను విడుదల చేయనున్నట్లు తెలిపారు. పోలింగ్ స్టేషన్, పోలింగ్ సిబ్బంది ఎంపిక, తుది ఓటరు జాబితా తయారీ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు క్రియా శీలక పాత్ర పోషించాలని సూచించారు. ఒక్కో పోలింగ్ కేంద్రం పరిధిలో 600 మంది ఓటర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఓటర్ల సంఖ్య650 దాటితే అదనపు పోలింగ్ కేంద్రంఏర్పాటు చేయాలన్నారు.
ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ కేంద్రాల్లో విధులను కేటాయించాలన్నారు. జిల్లా పంచాయతీ రాజ్ కార్యాలయాలతో పాటు మండల స్థాయిలోనూ ప్రత్యేకంగా ఎలక్షన్ సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు.
నిజామాబాద్లో ఏర్పాటు చేసిన వీసీలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, అదనపు కలెక్టర్ అంకిత్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్, జడ్పీ సీఈవో ఉష, డీపీవో తరుణ్ కుమార్, ఆర్డీవోలు రాజేంద్ర కుమార్, రాజాగౌడ్, రాజేశ్వర్, కామారెడ్డిలో కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్,అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డీపీవో శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు.