రుద్రూర్/ చందూర్, డిసెంబర్ 31: రైతుబంధు డబ్బులు ఖాతాల్లో జమకావడంతో అన్నదాత ఆనందంలో మునిగితేలుతున్నాడు. పెట్టుబడి సాయం వచ్చినట్లు ఫోన్లకు సమాచారం రావడంతో సంబురాలు చేసుకుంటున్నారు. దీంతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. రైతుబంధు సాయం కోసం వచ్చిన రైతులతో బ్యాంకులు సందడిగా మారాయి. పొలంబాట పడుతున్న సమయంలో రైతుబంధు డబ్బులు అందడంపై రైతుకుటుంబాలు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నాయి.
సమయానికి డబ్బులు అచ్చినయ్..
పొలంలో పెట్టుబడి పెట్టే సమయంలో రైతుబంధు రావడం చాలా సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ పుణ్యాన పెట్టుబడి కోసం అప్పులు చేసే తిప్పలు తప్పింది. పెట్టుబడి సాయం అనేది రైతులకు వ్యవసాయంపై ఆసక్తి పెంచుతుంది.
– సాయిలు సావిత్రి,రైతు, రుద్రూర్
కేసీఆర్కు కృతజ్ఞతలు
గ్రామంలో నాకు రెండెకరాల పొలం ఉంది. గ్రామంలో ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తూ నా పొలాన్ని గతంలో కౌలుకు ఇచ్చి.. వచ్చిరాని డబ్బులతో బతికేవాడిని. తెలంగాణ వచ్చినంక రైతుబంధు పథకంతో వ్యవసాయంపై ఆశలు పెరిగాయి. ఇప్పుడు పొలం నేనే చేసుకుంటున్న. పెట్టు బడి సాయం అందడం ఆనందంగా ఉంది. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– తోకల లాలాబోయి, రైతు, ఘన్పూర్
ఇబ్బందులు తొలిగాయి..
తాతల కాలం నుంచి పంటలు పండిస్తున్నాం. పెట్టుబడికి అప్పులు తెచ్చి వడ్డీ కట్టేవాళ్లం. పంటకు వచ్చిన డబ్బులన్నీ బాకీలకే పోయేది. రైతుబంధు వచ్చినంక మా కష్టాలు దూరమయ్యాయి. ఇప్పుడు వ్యవసాయంపై ఆసక్తి కూడా పెరిగింది.
-పోతన్న, రైతు, మోస్రా
మళ్లీ గ్రామానికి వచ్చిన..
వ్యవసాయం చేసి విసుగొచ్చి అప్పులతో తమ్ముడికి పొలం అప్పజెప్పి బతుకు దెరువు కోసం పట్టణం పోయి అప్పు తీర్చిన. కేసీఆర్ రైతుబంధు తీసుకురావడంతో మళ్లీ గ్రామానికి వచ్చిన. వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందడంతో అన్ని ఇబ్బందులూ తొలగిపోయినయ్. పెట్టుబడి డబ్బులు పోనూ మిగులుతున్నాయి.
-మల్లారం నానాక్, రైతు, తిమ్మాపూర్
ధైర్యం ఇచ్చిన దేవుడు కేసీఆర్
వ్యవసాయం చేయడానికి సీఎం కేసీఆర్ మాకు ధైర్యం ఇచ్చారు. మాలాంటి రైతులకు పెట్టుబడి కోసం అప్పులు కూడా ఇవ్వడానికి ఎవరూ ముందుకురారు. అలాంటి సమయంలో సీఎం కేసీఆర్ అందజేస్తున్న రైతుబంధు డబ్బులతో పంటలను సాగుచేస్తున్న. రైతుబంధు డబ్బులు నాకు రూ. ఏడు వేలు వచ్చాయి.
-నక్క అనుసూజ, మహిళా రైతు, చిక్కడ్పల్లి
రైతుకు మరింత భరోసా
రైతుబంధు డబ్బులు నా ఖాతాలో పడ్డయి. చాలా సంతోషంగా ఉంది. పెట్టుబడికి ఈ పైసలను వాడుకుంట. వ్యవసాయానికి ఖర్చు చేసే సమయంలో రైతుబంధు డబ్బులు రావడం ఆనందంగా ఉంది.
-కుర్లెం సుదర్శన్, రైతు, చిక్కడ్పల్లి
వడ్డీ కట్టుడు తప్పింది..
నాకు రెండెకరాల పొలం ఉంది. ప్రతి పంటకూ కేసీయార్ సార్ రైతుబంధు డబ్బులు ఖాతాలో జమచేస్తున్నరు. పంటపంటకు సేటు దగ్గరకు పోయి అప్పులు తెచ్చే ఇబ్బందులు పోయినయి. వడ్డీ కట్టుడు తప్పింది.
– కేతావత్ తుకారాం, రైతు, శంకోరా తండా