Nizamabad | కంటేశ్వర్ జనవరి 9 : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలని నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగేష్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2004లో ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్ పర్సన్ గా సోనియాగాంధీ వలసలను నివారించడానికి, ఉపాధి కల్పించడానికి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చినట్లు గుర్తు చేశారు. దానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని పేరు పెట్టారని చెప్పారు.
కానీ ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఆ పథకాన్ని పేరు మారుస్తూనే దానిని నీరు గార్చే ప్రయత్నం చేస్తోందని, ఉపాధి హామీ పనిలో 100 రోజులు పని దినం ఉన్నదానిని 125 రోజులు చేస్తున్నామని బీజేపీ గొప్పలు చెప్పుకుంటోందని మండిపడ్డారు. మహాత్మా గాంధీ పేరును తీసివేసి జీ రామ్ జీ అని పేరు పెట్టి పథకాన్ని నీరు గార్చే విధంగా బీజేపీ చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, వర్ని ఏఎంసీ చైర్మన్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సురేష్ బాబా, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు రాజా నరేందర్ గౌడ్, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు సంతోష్, నగర మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎజాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఈసా, మోపాల్ మండల అధ్యక్షుడు సాయిరెడ్డి, సర్పంచులు కిసాన్, జనార్దన్, అష్రఫ్, నరేందర్ గౌడ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.