నిజామాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి జిల్లాలో కొంతకాలంగా మత్తు పదార్థాల దందా జోరుగా సాగుతున్నది. తరచూ ఏదో ఒక చోట మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుంటున్న ఘటనలు కోకొల్లలు. ఉమ్మడి జిల్లాకు చెందిన కొంతమంది సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి సరఫరా అవుతున్న అల్ఫ్రాజోలం కొనుగోలు చేస్తున్నారు. పది రోజుల క్రితం బోధన్‌లో రెండున్నర కిలోల నిషేధిత ఆల్ఫ్రాజోలం పట్టుకోగా పోలీసులు కీలక ఆధారాలు సంపాదించారు. పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టగా నిషేధిత మత్తు పదార్థం తయారీ కేంద్రం గుట్టురట్టయ్యింది.
మహారాష్ట్రలో లైసెన్సుడ్ రసాయన దుకాణంలో అల్ఫ్రాజోలాన్ని గుట్టుగా తయారుచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు వ్యాపారితోపాటు ఆల్ఫ్రాజోలాన్ని సరఫరా చేసే మధ్యవర్తులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా 30 కిలోల ఆల్ఫ్రాజోలాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.3 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా చరిత్రలో ఇంత భారీ మొత్తంలో పట్టుబడడం రికార్డు అని పోలీసులు చెబుతున్నారు.
గతంలోనూ పెద్దమొత్తంలో నిషేధిత మత్తు పదార్థం లభ్యం కాగా మరోసారి సీపీ సాయి చైతన్య నేతృత్వంలోని పరిశోధక బృందం దర్యాప్తులో కీలకవిషయాలను రాబట్టింది. అల్ఫ్రాజోలం మహారాష్ట్ర నుంచి పల్లెలకు సులువుగా చేరుతోంది. తయారీ దారులు, మధ్యవర్తులు, కొనుగోలుదారులు గుట్టుగా ఒక చీకటి వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. మరింత లోతుగా దర్యాప్తు చేస్తే ఈ కేసులో వందలాది మంది కొనుగోలుదారులు పోలీసులకు చిక్కే అవకాశం ఉన్నది.
మహారాష్ట్ర నుంచి సరఫరా
నెలన్నర క్రితం కామారెడ్డి జిల్లాలోనూ అల్ఫ్రాజోలం పట్టుబడింది. మహారాష్ట్ర సరిహద్దు మద్నూర్‌లో 250 గ్రాముల నిషేధిత పదార్థం పట్టుబడగా.. ఈ కేసులో పోలీసులు కూపీ లాగారు. మత్తు పదార్థం విక్రయిస్తున్న లింకును కనుగొన్నారు. తద్వారా హైదరాబాద్‌లో ఓ వ్యాపారి గుట్టు రట్టయ్యింది. మరింత లోతుగా కేసును పరిశోధించగా మద్నూర్‌లో మరికొంత మంది వెలుగులోకి వచ్చారు. ఈ నెల 15న బోధన్‌లో రెండున్నర కిలోల అల్ఫ్రాజోలం పట్టుబడగా ఎన్డీపీఎస్ యాక్టు 1985 ప్రకారం బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి పలువురిని కటకటాలకు పంపించారు.
వీరితో సత్సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తుల కూపీ లాగితే మహారాష్ట్రలోని సతారా జిల్లాలో అల్ఫ్రాజోలం తయారు చేస్తున్న ఓ వ్యాపారి పట్టుబడ్డాడు. ఓ కెమికల్ కంపెనీ పేరుతో అల్ఫ్రాజోలం ఉత్పత్తి చేసి నిజామాబాద్ జిల్లాకు తరలిస్తున్నాడు. ఇందులో సాలూర ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి పోలీసులకు చిక్కాడు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తే అనేక మంది కొనుగోలుచేసినవారు బయటపడే అవకాశం ఉండగా.. ప్రస్తుతానికి కొద్ది మంది మాత్రమే పోలీసులకు చిక్కారు.
కొనుగోలుదారులు చిక్కేదెలా?
నిషేధిత పదార్థాలను తయారీ చేసి విక్రయించడం ఎంత పెద్ద తప్పో, కొనుగోలు చేయడం కూడా అంతే తప్పు. ఉమ్మడి జిల్లాలో కల్లు తయారీ కాంపౌండ్‌లో లక్షల లీటర్లలో కల్తీ కల్లు తయారవుతున్నది. వందలాది కల్లు డిపోలకు అల్ఫ్రాజోలం మత్తు పదార్థాన్ని గుట్టుగా 5 గ్రాములు నుంచి 10 గ్రాములు వరకు జేబులో పెట్టుకుని తరలిస్తుండడం గమనార్హం. కల్తీ కల్లును విక్రయించి రూ.లక్షలు దండుకుంటూ సామాన్యుల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నారు. బోధన్‌లో నమోదైన కేసును లోతుగా దర్యాప్తు చేసి లింకులను ఛేదిస్తే వందలాది మంది కొనుగోలుదారుల ఆచూకీ లభించే అవకాశం ఉన్నది.
అప్పుడు కల్తీ కల్లు తయారీకి దాదాపుగా ఫుల్స్టాప్ పడే అవకాశాలున్నాయి. సీపీ సాయి చైతన్య గతంలో నార్కొటిక్స్ బ్యూరోలో పని చేసిన అనుభవంతో అక్రమార్కుల గుట్టును రట్టు చేసి రికార్డు స్థాయిలో అల్ఫ్రాజోలం పట్టుకున్నారు. ఇదే స్ఫూర్తితో కొనుగోలుదారులను సైతం పట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఉమ్మడి జిల్లాలో కల్లు డిపోల నిర్వాహకులకు కొందరు రాజకీయ పార్టీల నాయకులు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో పోలీసుల ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయమై కాలమే నిర్ణయించాల్సి ఉంది.
అక్రమార్కుల ఆట కట్టిస్తాం
నిషేధిత మత్తు పదార్థాలను విక్రయించడం, కొనడం నేరం. డ్రగ్స్ విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నం. మాదక ద్రవ్యాల కట్టడికి ప్రజలు సహకరించాలని కోరుతున్నా. గంజాయి,అల్ఫ్రాజోలం రవాణాపై సమాచారం ఉంటే పోలీసులకు అందిస్తే అక్రమార్కులఆట కట్టిస్తాం.
– సాయి చైతన్య,నిజామాబాద్ పోలీస్ కమిషనర్