Collector Ila Tripathi | కంఠేశ్వర్, జనవరి 9 : క్రీడా రంగంలో నిజామాబాద్ జిల్లా ఖ్యాతిని మరింతగా ఇనుమడింపజేయాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్-2026 సెకండ్ ఎడిషన్ క్రీడా పోటీలను నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో కలిసి శుక్రవారం జెండా ఊపి టార్చ్ రిలే ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. పాలిటెక్నిక్ మైదానం నుండి ప్రారంభమైన టార్చ్ రిలే ర్యాలీ, ప్రధాన మార్గాల మీదుగా పాత కలెక్టరేట్ గ్రౌండ్ వరకు కొనసాగింది.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా నుండి నిఖత్ జరీన్, యెండల సౌందర్య, గూగులోత్ సౌమ్య, హుస్సాముద్దీన్ వంటి అనేక మంది అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ప్రాతినిధ్యం వహిస్తుండడం ఎంతో గొప్ప విషయమన్నారు. వీరిని స్పూర్తిగా తీసుకుని విద్యార్థులు, గ్రామీణ ప్రాంత క్రీడాకారులు తమ ప్రతిభను మెరుగుపర్చుకోవాలని కలెక్టర్ సూచించారు. క్రీడల్లో ధనిక, పేద అనే తారతమ్యం ఉండదని, ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు ప్రతిభనే కొలమానం అని క్రీడాకారులకు మార్గనిర్దేశం చేశారు. అతి సామాన్య కుటుంబం నుండి వచ్చిన క్రికెటర్ మహ్మద్ సిరాజ్ జీవితమే ఇందుకు చక్కటి నిదర్శనమని కలెక్టర్ ఉదహరించారు.
క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిస్తే బంగారు భవిష్యత్ సొంతమవుతుందన్నారు. సీఎం కప్ క్రీడా పోటీలలో అన్ని అంశాలలో జిల్లాకు చెందిన క్రీడాకారులు అద్భుత ప్రదర్శన ఇచ్చి, నిజామాబాద్ ప్రతిష్టను ఇనుమడింపజేయాలని పిలుపునిచ్చారు. తాను కూడా స్విమ్మింగ్ క్రీడాకారిణి అని, ఫ్రీ స్టైల్, రిలే, బట్టర్ ఫ్లై తదితర విభాగాలలో అనేక పోటీలలో పాల్గొన్నానని కలెక్టర్ క్రీడల పట్ల తనకు గల ఆసక్తి గురించి తెలియజేశారు. చక్కటి దేహదారుఢ్యానికి, ఆరోగ్యానికి క్రీడలు ఎంతగానో ఉపకరిస్తాయని గుర్తు చేశారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే మెదడు చురుకుగా మారి చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపగలుగుతారని, అన్ని రంగాలలో చక్కగా పని చేయవచ్చని సూచించారు. క్రీడల అభివృద్ధికి జిల్లా యంత్రాంగం తరపున పూర్తి స్థాయిలో తోడ్పాటును అందిస్తామని అన్నారు.
అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో ఆసక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థి దశ ఎంతో కీలకమైనదని, దురలవాట్ల బారిన పడకుండా ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని, ఇందుకు క్రీడలను వేదికగా మల్చుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి అధికారి పవన్ కుమార్, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, సీఎస్ఐ డిగ్రీ కళాశాల ఎన్సీసీ అధికారి కెప్టెన్ రాజేశ్వర్, క్రీడా సంఘాల ప్రతినిధులు, కోచ్‌లు, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.