నిజామాబాద్ క్రైం/కామారెడ్డి (నమస్తే తెలంగాణ), ఆగస్టు 17 : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మద్యం టెండర్లకు భారీగా స్పందన వస్తున్నది. టెండర్లు వేసేందుకు వ్యాపారులు పోటీ పడుతున్నారు. గురువారం ఒక్కరోజే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 1405 టెండర్లు దాఖలయ్యాయి. టెండర్ల దాఖల గడువు నేటి(శుక్రవారం)తో ముగియనున్నది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 3094 దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజు భారీగా టెండర్లు దాఖలయ్యే అవకాశాలు ఉన్నాయి.
నిజామాబాద్‌లో 960 దరఖాస్తులు
నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్, మోర్తాడ్ ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో ఉన్న 102 మద్యం షాపులకు టెండర్లు వేసేందుకు మద్యం వ్యాపారులు పోటీ పడుతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన మొత్తం దరఖాస్తులతో పోలిస్తే గురువారం ఒక్కరోజే 50 శాతం టెండర్లు దాఖలు కావడం గమనార్హం. జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో గల ప్రొహిబిషన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్ పర్యవేక్షణలో సూపరింటెండెంట్ కె.మల్లారెడ్డి ఆధ్వర్యంలో దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతున్నది. ఈ నెల 18వ తేదీ దరఖాస్తుల స్వీకరణకు చివరి రోజు కావడంతో గురువారం అధికారుల అంచనాల కన్నా ఎక్కువగా అప్ల్లికేషన్లు వచ్చాయి. ఉదయం 9గంటల మొదలైన అఫ్లికేషన్ల స్వీకరణ రాత్రి 9 గంటల వరకు కొనసాగింది. నిజామాబాద్ పరిధిలో 404, బోధన్ 134, ఆర్మూర్ 172, భీమ్‌గల్ 113, మోర్తాడ్ పరిధిలో 137.. మొత్తం 960 దరఖాస్తులు వచ్చాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా 11 రోజులుగా ఇప్పటి వరకు వచ్చిన అప్లికేషన్ల సంఖ్య 1,706 కు చేరింది.
కామారెడ్డిలో 445 టెండర్లు
కామారెడ్డి జిల్లాలోని 49 మద్యం దుకాణాల కోసం ఎక్సైజ్ శాఖ దరఖాస్తులను ఆహ్వానించగా, జిల్లాలో వ్యాపారుల నుంచి భారీ స్పందన లభిస్తున్నది. జిల్లా వ్యాప్తంగా గురువారం నాటికి 1388 దరఖాస్తులు వచ్చాయి. గురువారం ఒక్కరోజే 445 దరఖాస్తులు రావడం గమనార్హం. నేటితో దరఖాస్తుల సమర్పణకు గడువు ముగుస్తుంది. గురువారం నాటికి ఎక్సైజ్ స్టేషన్ల వారీగా పరిశీలిస్తే… కామారెడ్డి స్టేషన్ పరిధిలో 469 దరఖాస్తులు, దోమకొండ స్టేషన్ పరిధిలో 273, ఎల్లారెడ్డి స్టేషన్ పరిధిలో 204, బాన్సువాడ స్టేషన్ పరిధిలో 220, బిచ్కుంద స్టేషన్ పరిధిలో 222 దరఖాస్తులు వచ్చాయి.