మాక్లూర్, మే 24: నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, ఎన్నారై బీఆర్ఎస్ గ్లోబల్ కన్వీనర్ బిగాల మహేశ్‌గుప్తా స్వగ్రామం మాక్లూర్‌లో నిర్మించిన అయ్యప్ప సహిత ఆంజనేయ శివపంచాయతన సహిత శ్రీ రుక్మిణి పాండురంగ విఠలేశ్వర దేవతా ప్రతిష్ఠ, పునశ్చరణ ఉత్సవాలు బుధవారంతో సంపూర్ణమయ్యాయి. హంపీ పీఠాధిపతి విద్యారణ్యభారతి స్వామి నేతృత్వంలో విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు కొనసాగాయి. ఉదయం నుంచి గణపతిపూజ, యంత్ర విగ్రహ స్థిర, శిఖర ప్రతిష్ఠాపన, తీర్థప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు వేదపండితులు కుప్పా జగన్నాథశర్మ, నర్సింహుల సురేశ్శాస్త్రి అధ్వర్యంలో నిర్వహించా రు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మం త్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. బిగాల గణేశ్‌గుప్తా, మహేశ్ గుప్తా వారి తండ్రి బిగాల కృష్ణమూర్తి సంకల్పాన్ని నెరవేర్చడంలో భాగంగా మూడు ఆలయాలు నిర్మించడం అభినందనీయమన్నారు. ఎంతో చేయాలని ఉన్నా అందరికీ ఇలాంటి అవకాశం రాదన్నారు. పుట్టిన ఊరికి సేవ చేయడమనేది వారి అదృష్టమని పేర్కొన్నారు. రాష్ట్రంలో గుడులు, బడుల నిర్మాణానికి కేసీఆర్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
అలయ ప్రతిష్ఠాపనోత్సవాల ముగింపురోజున ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బిగాల సోదరులను అభినందించారు. ఉత్సవాలకు హాజరైన వారిలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్రావు, రూరల్ ఎమ్మెల్యే, అర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, రాష్ట్ర ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆకుల లలిత, మేయర్ దండు నీతూ కిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, సూదం లక్ష్మి, కేశవేణు, సర్పంచ్ అశోక్ రావు, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ జిల్లా, మండల నాయకులు ఉన్నారు.