కామారెడ్డి, జూలై 30: ‘ఏండ్ల సంది గ చెర్వునే నమ్ముకున్నం. ఆ నీళ్లతోనే పంటలు పండించుకుంటున్నం. గిప్పుడు యాడికెళ్లి మోపయిండ్రో ఏమో. మా నోట్ల మన్నుకొట్టి పెద్ద చెర్వు నీళ్లను కామారెడ్డికి తీసుకుపోతామంటుండ్రు’ అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లను తరలించే కుట్రను మానుకోవాలని, లేకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. సదాశివనగర్ మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్దచెరువు నుంచి 30 శాతం నీటిని కామారెడ్డికి తరలించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ పది గ్రామాల రైతులు మంగళవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు.
నీటి తరలింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం లేవదీస్తామని హెచ్చరించారు. ఇటీవల కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ ఇందుప్రియ అధికారులతో వచ్చి అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువును పరిశీలించి, 30 శాతం నీటిని కామారెడ్డి పట్టణానికి తీసుకెళ్తామని ప్రకటించారని, దీంతో 10 గ్రామాల రైతులం తీవ్రంగా నష్టపోతామన్నారు. నీటిని తరలించుకుపోతే పది గ్రామాలు పడావుగా మారుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పెద్ద చెరువు నుంచి వచ్చే నీటితో అడ్లూర్ ఎల్లారెడ్డి, అడ్లూర్, రంగంపేట్, పోసానిపేట్, రామారెడ్డి, కన్నాపూర్, గొల్లపల్లి, గర్గుల్, ఇస్రోజివాడి, టేక్రియాల్ గ్రామాలకు చెందిన 2,100 ఎకరాల్లో రెండు పంటలు పండుతాయన్నారు. కామారెడ్డికి నీటిని తరలించుకు పోతే రెండు వేల ఎకరాలకు సాగునీరు దొరకదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు పునరాలోచించి నీటి తరలింపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలన్నారు. లేకపోతే ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ధర్నా తర్వాత రైతులు అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డిని కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ సుజాత వద్దకు వెళ్లి తమ గోడు వెళ్లబోసుకున్నారు. పెద్ద చెరువు నీటిని కామారెడ్డికి తరలించాలనే కుట్ర జరుగుతున్నదని, దీంతో తాము తీవ్రంగా నష్టపోతామన్నారు. నీళ్లను తరలించుకెళ్లి తమ నోట్లో మట్టి కొట్టొద్దని అడ్లూర్ ఎల్లారెడ్డి సొసైటీ చైర్మన్ సదాశివారెడ్డి, రామారెడ్డి మాజీ ఎంపీపీ దశరథ్‌రెడ్డి, సదాశివనగర్ మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ జానకీ జనార్దన్ విజ్ఞప్తి చేశారు.
అడ్లూర్ఎల్లారెడ్డి పెద్ద చెరువు నుంచి నీటిని కామారెడ్డికి తరలించాలని చూస్తే ఊరుకునేది లేదు. మరో ఉద్యమం తప్పదు. వేలాది మంది రైతులు ఈ చెరువు మీదనే ఆధారపడి బతుకుతున్నారు. వాళ్ల నోట్లో మట్టి కొట్టి నీళ్లు ఎత్తుకుపోతామంటే ఊరుకోం. నీటిని తరలించాలన్న ఆలోచన మానుకోవాలి.
– ఎ.బాల్‌రాజు, రైతు, అడ్లూర్ ఎల్లారెడ్డి
అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు నుంచి 30 శాతం నీటిని కామారెడ్డికి తరలిస్తే ఆయకట్టు రైతుల పరిస్థితి ఏమిటో ఆలోచించరా? రెండు వేల ఎకరాల్లోని పంటలు ఎండిపోతాయన్న సంగతి తెల్వదా? నీటిని తరలించాలన్న ఆలోచనను విరమించుకోవాలె. రైతులకు మంచి చేయాల్సింది పోయి ఇబ్బందులు పెడతామంటే ఊరుకునేది లేదు
– బి.వెంకటి, అడ్లూర్ ఎల్లారెడ్డి
అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువు మీద పది ఊర్లు ఆధారపడ్డాయి. ఈ చెరు వుతోతాగునీటికి, సాగునీటికి ఇన్నా ళ్లు ఢోకా లేకుండె. కొత్తగా ఇప్పుడు వచ్చి పది ఊళ్లకు నష్టం చేస్తామంటే ఎట్ల. నీళ్లను తీసుకుపోతామంటే రైతులు అసలే ఊరుకోరు. పొలాలను ఎండబెడతామంటే చూస్తూ కూర్చోలేం. అధికారులు ఆలోచించాలే. లేకపోతే ఉద్యమాలు లేవదీసుడు తప్ప మరోకటి ఉండది.
– సి.ఆకుల విఠల్, అడ్లూర్ ఎల్లారెడ్డి
ఎన్నో ఏండ్ల సంది పెద్ద చెరువును నమ్ముకుని సాగు చేసుకుంటున్నం. కొత్తగా ఇప్పుడొచ్చి నీళ్లు ఎత్తుకుపోతామనుడేంది.? ఎంతో మంది రైతులు ఆధారపడే అడ్లూర్ పెద్ద చెరువు నుంచి నీటిని తరలించే కుట్రను మానుకోవాలి. లేదంటే రోడ్డెక్కుడు తప్ప మరో గత్యంతరం లేదు. సాగు మీద ఆధారపడి బతుకుతున్న రైతులతోని ఆడుకోవద్దు.
– డి.చిన్న మల్లయ్య, రంగంపేట్