నస్రుల్లాబాద్, అక్టోబర్ 22 : కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం నెమ్లి గ్రామంలో నిర్మించిన సాయిబాబా ఆలయం తెలంగాణ షిర్డీగా పేరుగాంచింది. ప్రాంగణం మొత్తం పచ్చని చెట్లు, వేసవిలో ఉపశమనం కోసం ప్రాంగణమంతా పచ్చని గడ్డి, నిత్యం భక్తుల రద్దీ, చిన్నారుల ఆట వస్తువులు ఆకట్టుకుంటాయి. ఆలయం నిర్మించి పదేండ్ల్లు మాత్రమే అవుతున్నా తరతరాలుగా ఉన్న వర్చస్సు సాయి ప్రతిమలో కనబడుతుంది.
ప్రకృతి రమణీయతకు మారుపేరు
ఆలయం మొత్తం పచ్చని చెట్లు ఏపుగా పెంచడంతో ఆహ్లాదం పంచుతున్నది. వివిధ ప్రాంతాల నుంచి పలు రకాల మొక్కలను ఆలయ కమిటీ వారు తెప్పించి చూపరులకు కన్నుల విందుగా ఏర్పాటు చేశారు. ఎంత వేసవిలో అయినా ఆలయ ఆవరణ అంతా చల్లగా ఉంటుంది.
కనువిందు చేసే ఆలయ ఆవరణ
ఆలయ ధర్మకర్త మోహన్ రెడ్డి ఆలయ ప్రాంగణాన్ని కనువిందు చేసేలా తీర్చిదిద్దారు. ఆలయంలో పూర్తిగా పాలరాతిని పరిచారు. ఆలయంలో ఏసీలను ఏర్పాటుచేసి భక్తులకు వేడిని నుంచి ఉపశమనం కల్పించారు. సాయి విగ్రహం ద్వారకా మాయిలో నిజరూపాన్ని పోలి ఉంటుంది. చావిడిలో ఏర్పాటు చేసిన సాయినాథుడి విగ్రహాన్ని చూడడానికి రెండు కండ్లు సరిపోవు. ఆలయ ప్రాంగణంలో సాయినాథుడు అన్నదానం చేసే సమయంలో చేతితో కలుపుతున్న విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది.
చిన్నారుల కోసం ప్రత్యేకంగా పార్క్..
వేసవి సెలవుల్లో చిన్నారులకోసం ప్రత్యేకంగా చిల్డ్రన్ పార్క్ సైతం ఏర్పాటుచేశారు. అందులో చిన్నారులు ఆడుకోవడానికి ఆట వస్తువులను సైతం ఏర్పాటు చేశారు.