ఖలీల్వాడి మార్చి 27: ఎండలు దంచికొడుతున్నాయి. రెండు, మూడ్రోజులుగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగి పోయాయి. శుక్రవారం 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మార్చిలోనే ఇలా ఉంటే, వచ్చే రెండు నెలలు భానుడి ప్రతాపంతో మరిన్ని ఇబ్బందులు పడడం ఖాయమని ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్, మే మాసాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయన్న వాతావరణ శాఖ ప్రకటనలతో భయాందోళనకు గురవుతున్నారు.
ప్రస్తుతం 40 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు.. రానున్న రోజుల్లో 45 డిగ్రీల దాకా నమోదు కావచ్చన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉద యం, సాయంత్రం వేళ బయట పనులు చేసుకోవాలని, అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటకు వెళ్లకూడదని చెబుతున్నారు. తలకు పండ్ల రసాలు, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండల్లో ఎక్కువగా తిరగక పోవడం ఉత్త మం. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదు. పని మీద తిరిగే వారు తలకు క్యాప్ ధరించాలి. చిన్న పిల్లలు, వృద్ధులను ఎండల్లో తిరగకుండా చూసుకోవాలి. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
– జలగం తిరుపతిరావు, నిజామాబాద్ మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్
కొద్దిరోజులుగా భానుడు ప్రతాపం చూపుతున్నాడు. అకాల వర్షాలతో ఇటీవల వాతావరణం కాస్త చల్లబడినా.. రెండు, మూడ్రోజులుగా ఎం డలు దంచి కొడుతున్నాయి. మొన్నటివరకూ 35 డిగ్రీలలోపే ఉన్న ఉష్ణోగ్రతలు క్రమంగా నాలుగు రోజుల్లోనే 40 డిగ్రీలకు చేరాయి. ఎండ వేడిమి, ఉక్కపోతతో జనం అల్లాడి పోతున్నారు. ఫ్యాన్లు, ఏసీల వినియోగం పెరిగిపోయింది. దీంతో మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. విద్యుత్ డిమాండ్ కూడా రోజురోజుకు పెరుగుతున్నది. వేసవి తాపాన్ని తీర్చుకునేందుకు ప్రజలు శీతల పానియాలు, కూల్డ్రింక్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో వాటి వినియోగం కూడా పెరిగింది.
