ఆర్మూర్‌టౌన్, ఫిబ్రవరి1: రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ఓడిపోవడం (డిఫీట్), కేసీఆర్ తిరిగి గెలవడం (రిపీట్) ఖాయమని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పోల్ సర్వేతోనే ఈ విషయం తేటతెల్లమైందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పోల్ సర్వేలో తెలంగాణ జనం సీఎం రేవంత్‌రెడ్డి సంక్షోభ పాలనపై రాళ్ల వర్షం, పదేండ్ల కేసీఆర్ సంక్షేమ పాలనపై పూల వర్షం కురిపించారని తెలిపారు. కాంగ్రెస్ దగా కోరు పాలన మాకొద్దు.. కేసీఆర్ పాలన ముద్దు అని కుండబద్దలు కొట్టడం ఏడాదికే కాంగ్రెస్ దుష్ట పరిపాలనపై తెలంగాణ ప్రజల విముఖతకు నిలువెత్తు నిదర్శనమన్నారు.
రేవంత్ పాలన పట్ల వ్యతిరేకతతో ఉన్న తెలంగాణ ప్రజలు దిమ్మ తిరిగేలా సమాధానం ఇచ్చారని రేవంత్ పాలనకు వ్యతిరేకంగా 67% మంది ఓటేయ్యడం మామూలు విషయం కాదని జీవన్‌రెడ్డి అన్నారు. ప్రజల మనోగతం చూసైనా కాంగ్రెస్ బుద్ధి తెచ్చుకోవాలని, ఇకనైనా ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. లేకపోతే రేవంత్ సర్కార్‌కు శంకరగిరి మన్యాలే గతి అని హెచ్చరించారు.