Telangana University | కంటేశ్వర్, నవంబర్ 27 : తెలంగాణ యూనివర్సిటీ వీసీ, రిజిస్టర్ తక్షణం తమ పదవులకు రాజీనామా చేయాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజుగౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో జరిగిన అక్రమ నియమకాలను రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పుపై యూనివర్సిటీ ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, యూనివర్సిటీ వీసీ, రిజిస్టార్ అండదండలతోనే అక్రమ నియామకాలపై హైకోర్టు డివిజన్ బెంచ్ అప్పీల్‌కు వెళ్లడం వాళ్లకు స్టే ఇవ్వడం చూస్తే ఇది వీసీ, రిజిస్టార్ల నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతుందని మండిపడ్డారు.
అక్రమ నియమకాల రద్దుపై స్టే ఇవ్వడం అంటే యూనివర్సిటీ అధికారులకు చెంపపెట్టు లాంటిదని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ తక్షణం వీసీ, రిజిస్టర్లు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ నియమకాలపై వెనక్కు తగ్గేది లేదని, అవసరమైతే హైకోర్టులో స్టే పై ఇంప్లిడ్ పిటీషన్ వేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా వీసీ, రిజిస్టార్లు అక్రమార్కులను కొమ్ముకాయకుండా యూనివర్సిటీ ప్రయోజనాల గురించి ఆలోచించాలని డిమాండ్ చేశారు.