నిజామాబాద్, నవంబర్ 7, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ యూనివర్సిటీలో 2012 నోటిఫికేషన్లను హైకోర్టు రద్దు చేస్తూ కీలక తీర్పును వెలువరించిన తర్వాత అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. 2006లో టీయూ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ప్రతి నియామకాల్లో నిబంధనలు తుంగలో తొక్కి అమలు చేసినవే ఉన్నాయి. పార్ట్‌టైం లెక్చరర్ నుంచి మొదలు పెడితే ప్రొఫెసర్ పోస్టుల వరకూ ఎక్కడా రోస్టర్ విధానాన్ని, రిజర్వేషన్లను పట్టించుకోలేదు. ఆయా విభాగాల్లో వర్క్ లోడ్‌ను సైతం నిర్ధారించకుండానే ఇష్టారీతిన నియామకాలు చేపట్టారు. దీని వల్ల యూనివర్సిటీ నిర్వాహణ ఖర్చులు పెరగడంతో పాటుగా నైపుణ్యం లేని వ్యక్తుల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన బోధన అందడం లేదు. మొత్తానికి తెలంగాణ యూనివర్సిటీ అనేక అంశాల్లో ఇతర యూనివర్సిటీలకు ధీటుగా ఎదగలేక చతికిల బడుతోంది. అకాడమిక్(టీచింగ్) విభాగాల్లో జరిగిన అక్రమాలకు అక్టోబర్ 31న హైకోర్టు వెలువరించిన కీలక తీర్పు ప్రత్యక్ష సాక్ష్యంగా ఉంది. అందులో హైకోర్టు న్యాయమూర్తి పేర్కొన్న అంశాలు లోపాలను తెటతెల్లం చేస్తున్నాయి. ఈ పోస్టులను రద్దు చేయడంతో ఇప్పుడు అందరి దృష్టి నాన్ టీచింగ్ (నాన్ అకాడమిక్) విభాగాల్లో తిష్ట వేసుకున్న అక్రమార్కులపై పడింది. పరిపాలన విభాగాల్లో చిన్నపాటి పోస్టులతో చేరిన వ్యక్తులు ఏకంగా సహాయ రిజిస్ట్రార్ పోస్టును చేపట్టేందుకు పోటీ పడేంత స్థాయికి ఎదగడం టీయూలోనే సాధ్యమైంది. వీరి అర్హతలను పునఃపరిశీలన చేసి, బ్యాక్ గ్రౌండ్ అకాడమిక్ ప్రొఫైల్‌ను విచారణ చేస్తే అక్రమార్కుల గుట్టు రట్టు అయ్యే అవకాశాలు లేకపోలేదు.
హైకోర్టు తీర్పును అమలు చేసేందుకు తెలంగాణ యూనివర్సిటీ పరిపాలన విభాగం చకచక అడుగులు వేయాలి. కానీ వారం రోజులవుతోన్న ఇప్పటి వరకు ముందడుగు పడలేదు. హైకోర్టు ఉత్తర్వుతో రద్దు కాబడిన 2012 నోటిఫికేషన్ పరిధిలోని ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు సాంకేతికంగా పని చేయడానికి అనర్హులుగా మారిపోతారు. శుక్రవారం నాటికి ఎలాంటి ఆర్డర్ కాపీలను టీయూ జారీ చేయలేదు. పైగా వీరంతా యథాలాపంగా తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్, సౌత్ క్యాంపస్‌లకు వచ్చి హాజరు వేశారు. గతానికి భిన్నంగా ఈసారి ఠంచనుగా అర గంట ముందే టీయూకు చేరుకోవడం కనిపించింది. హైకోర్టు తీర్పు కాపీ తమ చేతికి అందలేదని చెప్పుకుంటున్నారు. టీయూ పరిపాలన విభాగం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేవని బుకాయిస్తున్నారు. వాస్తవానికి హైకోర్టు అధికారిక వెబ్సైట్లో అక్టోబర్ 31 తేదీ రోజున జస్టీస్ నగేశ్ భీమపాక జారీ చేసిన 24పేజీల ఉత్తర్వుల కాపీ మూడు రోజుల నుంచి తెలంగాణ హై కోర్టు అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చింది. ప్రజా బాహుళ్యంలో ఉన్న హైకోర్టు తీర్పు సాంకేతికంగా టీయూ పరిపాలన విభాగానికి వర్తిస్తుంది. జడ్జిమెంట్ కాపీ అధికారికంగా తెలంగాణ యూనివర్సిటీకి రాలేదం టూ చెప్పుకుంటుండటం అనుమానాలు దారితీస్తోంది. ఇదంతా ఉద్దేశపూర్వకమైన తాత్సారంగా పలువురు భావిస్తున్నారు. దీనంతటికి తెర వెనుక ఏమైనా కారణాలు ఉన్నా యా? అన్న అనుమానాలు కలుగుతున్నా యి. హైకోర్టు ఉత్తర్వుల అమలులో జరుగుతున్న జాప్యాన్ని కోర్టు ధిక్కరణకు వస్తుందని పలువురు న్యాయ నిపుణులు సైతం అంచనా వేస్తున్నారు.
తెలంగాణ యూనివర్సిటీలో 2012 నోటిఫికేషన్ల మాదిరిగానే న్యాయపరమైన విచారణ చేయిస్తే అక్రమార్కులు అనేకులు వెలుగు చూసే అవకాశాలు లేకపోలేదు. 2012లో భర్తీ కాబడిన వారే కాకుండా మిగిలిన ప్రొఫెసర్లలో కొంత మందికి సరైన పీహెచ్‌డీలు లేవని సమాచారం అందుతోంది. టీయూ నెలకొల్పిన కొత్తలో ఇతర రాష్ర్టాల నుంచి తక్కువ సమయంలో ఫేక్ పీహెచ్‌డీలు తీసుకుని ప్రొఫెసర్లుగా చలామణి అయ్యారని తెలుస్తోంది. వీరంతా వివిధ హోదాల్లో ఇప్పటికీ యూనివర్సిటీలో పని చేస్తుండటం విడ్డూరంగా మారింది. నాన్ అకా డమిక్ విభాగాల్లో నోటిఫికేషన్లు జారీ చేయకుండానే ఇష్టారీతిన నియామకాలు జరిగాయని ఆరోపణలు ఉన్నా యి. కాంట్రాక్ట్ ప్రాతిపదికన మొదట రిక్రూట్ చేసుకున్న అనంతరం వారిని టీయూ రెగ్యులర్ పోస్టుల్లోకి తీసుకున్నారని విమర్శలు ఉన్నాయి. ఈ ప్రక్రియను చేపట్టానికి భారీ స్థాయిలో ముడుపులు ముట్టినట్లుగా తెలుస్తోంది. అక్బర్ అలీఖాన్ ఆధ్వర్యంలో జరిగిన కోర్టు ధిక్కరణ చర్యలు, నిబంధనల ఉల్లంఘనలను అలుసుగా చేసుకుని పలువురు వైస్ ఛాన్స్లర్లు, ఇన్ఛార్జీ వైస్ ఛాన్స్లర్లు(ఐఏఎస్ అధికారులు) బరితెగించి ఇష్టారీతిన వ్యవహరించారని ప్రచారం జోరుగా సాగుతోంది. హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాత పరిపాలన బాధ్యతలు నిర్వర్తించే రిజిస్ట్రార్ అధికారిక ప్రకటన చేయలేదు. కనీసం స్పందించేందుకు నిరాకరిస్తుండటం విడ్డూరంగా మారింది.
హైకోర్టు తీర్పు అమలు చేయకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు(కోర్టు ధిక్కారణ)గా పరిగణించబడుతుంది. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు యాక్ట్ 1971 ప్రకారం వైస్ ఛాన్స్లర్, రిజిస్ట్రార్లకు చట్ట ప్రకారం శిక్ష విధించేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. వీలైతే రూ.50వేలు నుంచి రూ.1లక్ష వరకు జరిమానాకు అవకాశం ఉంటుంది. 6 నెలల జైలు శిక్ష విధించవచ్చు. క్రమశిక్షణ రాహిత్యంపై చర్యలు తీసుకోవచ్చు. హైకోర్టు విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని(పర్సనల్ అప్పీయరెన్స్) వీసీ, రిజిస్ట్రార్లను ఆదేశించేందుకు ఆస్కారం ఉంటుంది. హైకోర్టు తీర్పు అమలును యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బాధ్యత. వీసీ, రిజిస్ట్రార్లు భారతీయ చట్టాలను, యూనివర్సిటీ యాక్ట్‌లను గౌరవించి తక్షణం రద్దు కాబడిన నియామకాల్లోని 45 మందిని రిలీవ్ చేస్తూ ఆర్డర్లు జారీ చేయాలి. ఖాళీ పోస్టులకు కొత్త నోటిఫికేషన్ జారీ చేసి యూజీసీ లేదా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మార్గదర్శకాల ప్రకారం ఎంపికను చేపట్టాల్సి ఉంటుంది. ప్రొఫెసర్లు ఉద్యోగాలు కోల్పోవాల్సిన దుస్థితి ఏర్పడటంతో అకాడమిక్ సిస్టమ్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. రద్దు చేసిన నియామకాల్లోని వ్యక్తులు తక్షణమే ఉద్యోగాల నుంచి తొలగించబడతారు. వారికి వెనక్కి జీతాలు ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే తీర్పు చట్ట విరుద్ధ నియామకాలను పూర్తిగా అసమర్ధం చేస్తుంది.
తెలంగాణ యూనివర్సిటీకి హైకోర్టు తీర్పు ఒక చెంపపెట్టు లాంటింది. ఇప్పటికైనా టీయూలోని అవకతవకలపై దృష్టిపెట్టాలి. 13 ఏండ్ల తర్వాత వచ్చిన హైకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నాం. అక్రమంగా చేపట్టిన ప్రొఫెసర్ల నియమకాన్ని రద్దు చేసి, పారదర్శకంగా నియామకాలు చేపట్టాలి. లేకుంటే మళ్లీ ధర్నాలు చేస్తాం.
– డాక్టర్ రాజశేఖర్, అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాక్య జాతీయ కన్వీనర్
టీయూలో 2012లో జరిగిన నియామకాలు అక్రమంగా జరిగాయి. అప్పటి సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో ఓ వైపు తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సమయంలో టీయూ లో ప్రొఫెసర్ల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేశారు. నోటిఫికేషన్లో ఇచ్చిన రోస్టర్ పాయింట్‌ను మార్చి, నియామకాలు చేపట్టారని హైకోర్టు తీర్పు ఇవ్వడం సంతోషకరం. అక్రమంగా వచ్చిన ప్రొఫెసర్ల నియామకాలను రద్దు చేసి, ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.
– డాక్టర్ రమావత్ లాల్‌సింగ్, టీయూవీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 2012లో చేపట్టిన నియామకాలు రద్దు చేసి, ఖాళీ అయిన పోస్టుల నియామకం పారదర్శకంగా చేపట్టాలి. నియామకాలు చేపట్టకపోతే మళ్లీ నిరసనలు చేపడుతాం.ఇప్పటికే ఎంతో మంది నిరుద్యోగులు చాలా నష్టపోయారు. ఇప్పటికైనా నియామకాలు చేపట్టాలి.
-అభిలాష్‌రెడ్డి, బీఆర్ఎస్ విద్యార్థి సంఘం నాయకుడు
టీయూలో ఇప్పటికైనా అవకతవకలు జరగకుండా చూడాలి. వెంటనే ప్రొఫెసర్ట నియామకాలు రద్దు చేసి నోటిఫికేషన్ జారీ చేసి పారదర్శకంగా నియామకాలు చేపట్టాలి. 13 ఏండ్ల తర్వాత తీర్పు రావడంతో ఇప్పటికే చాలా మంది నిరుద్యోగులు నష్టపోయారు. ఇప్పటికైనా అవకతవకలు జరగకుండా చూడాలి.
– రాకేశ్, తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సంఘం నాయకుడు
టీయూలో అక్రమ నియామకాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. రాజ్యంగబద్ధంగా రిజర్వేషన్ రోస్టర్ విధానం పాటించకుండా నియామకాలు చేపట్టడం సరికాదు. కోర్టు తీర్పును అనుసరించి అధికారులు నియామకాలు చేపట్టాలి అలాగే యూనివర్సిటీ భూములు కబ్జాకు గురికాకుండా చూడాలి.
– జన్నారపు రాజేశ్వర్, పీడీఎస్‌యూ జిల్లా ప్రధానకార్యదర్శి