డిచ్పల్లి/ సిరికొండ, ఆగస్టు 17: రూరల్ నియోజకవర్గంలో రైతులకు సాగునీటికి ఢోకాలేదని ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. గత ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీల కన్నా ఎక్కువగానే నెరవేర్చినట్లు తెలిపారు.ప్రతిపక్ష నాయకులు చేసే విమర్శలను పట్టించుకోనని స్పష్టం చేశారు. గురువారం ఆయన సిరికొండలో కల్యాణలక్ష్మి, సీఆర్ఎంఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం డిచ్పల్లి మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు సాగునీరు తేవడం లేదని ఆరోపిస్తున్నారని, రైతులకు సాగునీటికి కొదవలేదన్నారు. రూ.2600 కోట్ల వ్యయంతో మంచిప్ప రిజర్వాయర్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
కుడి, ఎడమ రెండు వైపులా పైప్లైన్ పనులు దాదాపు పూర్తయినట్లు చెప్పారు. ప్రతిపక్ష పార్టీల నాయకుల అబద్ధపు మాటలను నమ్మి కొందరు రైతులు తమ పంట భూముల్లో పైప్లైన్ వేయనీయక పోవడంతో నీళ్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నా కాస్త ఆలస్యం అవుతుందని వివరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పాత డిజైన్ ప్రకారం పనులు జరిగే అవకాశం లేదని ఈ విషయం గమనించి రైతులు పైప్లైన్ ఏర్పాటుకు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. రూరల్ నియోజకవర్గంలో త్వరలో 300 మంది లబ్ధిదారులకు బీసీ బంధు కింద ఆర్థిక సాయం అందజేస్తామని బాజిరెడ్డి తెలిపారు. ముస్లింలకు వందమంది లబ్ధిదారులకు అందిస్తామన్నారు. 1100 మంది లబ్ధిదారులకు దళితబంధు అందజేస్తామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.19కోట్ల 16లక్షల 50వేలు నిధులు మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.డిచ్పల్లిని మున్సిపాలిటీగా మారుస్తామని తెలిపారు.
రూరల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరికి వారు అభ్యర్థులమంటూ గోడలపై రాతలు రాయించు కున్నారని తెలిపారు. ప్రజలు మాత్రం రాతలు రాసిన పార్టీకి కాదు బీఆర్ఎస్ చేసిన అభివృద్ధికి ఓట్లు వేస్తారని బాజిరెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కాదని చంద్రబాబు ఏజెంట్ అని విమర్శించారు. రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్న ప్రభుత్వాన్ని ఎద్దేవా చేయడం సిగ్గు చేటన్నారు. మూడు గంటల కరెంట్ ఇవ్వాలని అనడం దారుణమన్నారు. మోదీ తెలంగాణ వ్యతిరేకి అని, మోసం చేసే పార్టీలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో రైతు సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని అన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో మన లాంటి పథకాలు లేవన్నారు. ఆర్టీసీలో నష్టాలను తగ్గించామని తెలిపారు.