ఖలీల్‌వాడి/కామారెడ్డి, ఏప్రిల్ 28: ఎండలు దంచి కొడుతున్నాయి. ఉభయ జిల్లాలు ఉడుకుతున్నాయి. భానుడి మహోగ్రరూపంతో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుతున్నాయి. మంగళవారం పలు చోట్ల 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ఎండ సెగ మొదలవుతున్నది. పది గంటలు దాటక ముందే ఉక్కపోత వేధిస్తున్నది. వేడిగాలులతో జనం అల్లాడి పోతున్నారు. భానుడి ప్ర‘తాపం’తో సతమతమవుతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావడం లేదు. దీంతో ఉదయం పది తర్వాత రోడ్లు దాదాపు నిర్మాణుష్యంగా మారుతున్నాయి. మధ్యాహ్నమైతే ఖాళీగా కనిపిస్తున్నాయి.
వాస్తవానికి మే నెలలో భానుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తుంటాడు. కానీ, ఈసారి మార్చి నుంచే ఎండల తీవ్రత పెరిగింది. ఏప్రిల్‌లో మరింత దంచి కొడుతున్నాయి. ఈ నెలలోనే ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరాయి. ఉమ్మడి జిల్లాలో 44 డిగ్రీలకు పైగా నమోదు కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వడగాలులు, ఎండవేడిమి కారణంగా కూలర్లు, ఏసీలు కూడా పెద్దగా ప్రభావం చూపలేక పోతున్నాయి. జిల్లాలో గతంలో అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఈసారి అంతకంటే ఎక్కువగా నమోదయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఉమ్మడి జిల్లాలో ఈసారి భిన్న వాతావరణం కనిపిస్తున్నది. ఓవైపు ఎండలు దంచి కొడుతుంటే, మరోవైపు అకాల వర్షా లు వెంటాడుతున్నాయి. ఇటీవల పలు ప్రాంతా ల్లో వడగండ్లు పడ్డాయి. సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయి, వర్ని, చందూరు తదితర మండలాల్లో వానలు కురిశాయి. ఇటు ఎండవేడిమి, అటు అకాల వర్షాలతో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. చిన్నారు లు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని చెబుతున్నారు. పని ఉంటే ఉదయం, సాయంత్రం వేళ చేసుకోవాలన్నారు. శరీరం డీహైడ్రేట్ కాకుండా కాపాడుకోవాలని, అందుకోసం ఎక్కువగా నీరు, పండ్ల రసాలు, చల్లటి పదార్థాలు తీసుకోవాలని పేర్కొంటున్నారు.
ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతేనే బయ టకు వెళ్లాలి. అలా వెళ్లే సమయం లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా ద్రవ పదార్థాలు సేవించాలి. ముఖ్యంగా శరీరంలో ప్లూయిడ్ లెవల్స్ పడిపోకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఫ్లూయిడ్ లెవల్ప్ తగ్గిపోతే శరీరం డీహైడ్రేషన్‌కి గురవుతుంది. కాబట్టి ఎక్కు మోతాదులో నీళ్లు, పండ్ల రసాలు తీసుకోవాలి. గంటకు 2-3 గ్లాసుల నీరు తీసుకోవాలి. పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. జ్వరం, వాంతలు, వీరేజనాలు ఉంటే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి.
– డాక్టర్ జలగం తిరుపతిరావు, వైస్ ప్రిన్సిపాల్, నిజామాబాద్ మెడికల్ కాలేజీ
వీలైనంత మేరకు ఎండలోకి వెళ్లకుండా చూసుకోవాలి. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలి. అది కూడా ఎండదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పుచ్చకాయ రసం, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం, చెరుకు రసంతో పాటు తేలికగా జీర్ణమయ్యే పదార్థాలను స్వీకరించాలి. ఆల్కహాల్, కాఫీ వంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే దవాఖానకు వెళ్లాలి.
– డా.రవీందర్‌గౌడ్, డీఎంహెచ్‌వో, కామారెడ్డి