ఖలీల్‌వాడి/ నిజామాబాద్ రూరల్/ ఆర్మూర్, ఏప్రిల్ 5: టెన్త్ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ హస్తం ఉన్నదని పలువురు బీఆర్ఎస్ నేతలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ మేరకు బండి సంజయ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. రాజకీయ లబ్ధి కోసం విద్యార్థుల తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురిచేస్తున్న బండి సంజయ్‌ని కఠినంగా శిక్షించాలని పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రుల ఫోరం ప్రతినిధి నరాల సుధాకర్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి బండి సంజయ్ పేపర్ లీక్ చేసే పనికి దిగజారడం ఘోరమన్నారు. కేవలం అధికారమే పరమావధిగా చూస్తున్న బండి సంజయ్ 15 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురి చేయడం క్షమించారని నేరమన్నారు. పేపర్ లీకేజీలో ఎంతటి వారు ఉన్నా గుర్తించి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా బుధవారం నిజామాబాద్‌లోని ఎన్టీఆర్ చౌరస్తాలో సంజయ్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ స్టేట్ చీఫ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమం లో కొయ్యాడ శంకర్, గైని సంపత్, వికాస్, కృష్ణ, అజయ్, సాయి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూర్‌లో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని మోదీ, బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ పస్క నర్సయ్య, జడ్పీటీసీ మెట్టు సంతోష్, అంకాపూర్, మంథని సర్పంచులు కిశోర్‌రెడ్డి, లింబారెడ్డి, కౌన్సిలర్ ఫయాజ్, బీఆర్ఎస్ నాయకులు పండిత్ పవన్, సుంక రి రంగన్న తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ నగరంలో ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్ ఆధ్వర్యంలో సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బండి సంజయ్ ప్రశ్న పత్రాల లీకుల వీరుడిగా మారాడని అన్నారు. బీజేపీ నాయకుల మాటలకు నిరుద్యోగులు, విద్యార్థులు నమ్మొద్దని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ముత్యంరెడ్డి, మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, నాయకులు మొచ్చ శ్రీనివాస్, అనూషా ప్రేమ్రాంగోపాల్రెడ్డి, నర్సింహాచారి, శ్రీకాంత్, మల్లెపూల సుభాష్, రాజు తదితరులు పాల్గొన్నారు.